July 11, 2026

Chinmayi: పవన్ కళ్యాణ్’ను కూడా వదలని చిన్మయి

Chinmayi: పవన్ కళ్యాణ్’ను కూడా వదలని చిన్మయి
Reading Time: 2 minutes
Chinmayi Reacts To Pawan Kalyan Wishes For Vairamuthu Jnanpith Award

జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికైన తమిళ లిరిసిస్ట్ వైరముత్తుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ (X) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ అభినందనల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను వివాదానికి దారితీసింది. వైరముత్తుపై గతంలో వచ్చిన ‘మీటూ’ ఆరోపణలను ప్రస్తావిస్తూ గాయని చిన్మయి శ్రీపాద పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. వైరముత్తును ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై చిన్మయి స్పందిస్తూ.. “గౌరవపూర్వకంగానే చెబుతున్నాను, వైరముత్తు అసలు నైజం పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉండదు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకోవడం సరికాదు. ఈ విషయాన్ని పవన్ గారి కార్యాలయ సిబ్బంది ఆయన దృష్టికి తీసుకెళ్లాలి. కేవలం సినిమాల్లో పాటలు రాసే వ్యక్తిని రాజకీయ నాయకులు ఎందుకు ఇలా ఆకాశానికెత్తుతున్నారో అర్థం కావడం లేదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

అంతకుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వైరముత్తుకు శుభాకాంక్షలు తెలపగా, చిన్మయి “అయ్యో.. మీకు ఇంకా అర్థం కావడం లేదా?” అని రిప్లై ఇచ్చారు. దీనిపై రజనీ అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌ను “గౌరవంతో” సంబోధించిన చిన్మయి, రజనీకాంత్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించడం ఆమె ద్వంద్వ వైఖరికి నిదర్శనమని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అధికారంలో ఉన్న వారిని చూసి చిన్మయి భయపడుతున్నారా? అని కొందరు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా చిన్మయి స్పందిస్తూ.. “నేను వైరముత్తు గురించి ఏళ్ల తరబడి పోరాడుతున్నాను. నాకు సినీ పరిశ్రమలో అన్యాయం జరిగినప్పుడు మీరంతా మౌనంగానే ఉన్నారు కదా? మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారికి మద్దతు ఇచ్చేవారిని ఎప్పటికీ నమ్మకూడదు” అని క్లారిటీ ఇచ్చారు.

Also Read:Tollywood: నటులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే సినిమాలు విడుదల చేయాలి..కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ వివాదంలోకి ప్రవేశించారు. “పవన్ కళ్యాణ్ గారు అందరినీ గౌరవించే వ్యక్తి. మా దైవం లాంటి వ్యక్తి గురించి తెలియకుండా మాట్లాడకండి” అని ఒక అభిమాని కామెంట్ చేయగా, “మీరు నన్ను గౌరవించడం ముఖ్యం కాదు. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి. బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలి” అని చిన్మయి బదులిచ్చారు. మరోవైపు, వివాదాలతో సంబంధం లేకుండా వైరముత్తు తనకు శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్, కమల్ హాసన్ మరియు పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పురస్కారాన్ని తనకు ఇష్టమైన వారికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి సమాధిని సందర్శించి నివాళులర్పించిన ఆయన, “నువ్వు లేని లోటు కనిపిస్తోంది, కన్నీళ్లతో ఈ పువ్వును సమర్పిస్తున్నాను” అంటూ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు.