July 11, 2026

Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఉన్నారు: పవన్

Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఉన్నారు: పవన్
Reading Time: < 1 minute
Potti Sriramulu Statue Unveiled In Amaravati Pawan Kalyan Says He Lives In Our Hearts

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళిగా 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన 125వ జయంతి సందర్భంగా అమరావతిలోని శాఖమూరులో ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహానుభావుడని అన్నారు. స్వాతంత్ర్య సమర కాలంలో మహాత్మా గాంధీ ‘నా వెంట 11 మంది ఉంటే దేశానికి స్వాతంత్ర్యం తీసుకురాగలను’ అన్న మాటలను గుర్తుచేశారు. అలాంటి మహనీయుల త్యాగాల వల్లే మనకు స్వేచ్ఛ లభించిందని ఆయన తెలిపారు.

తాను పొట్టి శ్రీరాములు గారిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం పొందలేదని, అయితే వారి కుటుంబ సభ్యులను చూడటం ద్వారా వారి త్యాగాలను గుర్తు చేసుకునే అవకాశం లభించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి నడిబొడ్డున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.