Reading Time: < 1 minute

ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి : ఆర్.కృష్ణయ్య

Caption of Image.
  • రాజ్యసభలో కేంద్రానికి ఆర్​.కృష్ణయ్య విజ్ఞప్తి  

న్యూఢిల్లీ, వెలుగు: ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో 56 శాతానికి పైగా జనాభా ఉన్న ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం సరికాదన్నారు. శుక్రవారం రాజ్యసభలో ఓబీసీల సమస్యలపై ఆయన మాట్లాడారు. కేంద్ర స్థాయిలో ఉపాధి, విద్య, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని.. నేషనల్ బీసీ కమిషన్, నేషనల్ బీసీ కార్పొరేషన్ వంటి సంస్థలు ఉన్నాయని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు వంటి అనేక సామాజిక వర్గాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయని పేర్కొన్నారు.

 ఓబీసీల కోసం అమలవుతున్న పథకాలు, వారి సంక్షేమం, అభివృద్ధిపై సమగ్రంగా సమీక్షించే ప్రత్యేక విభాగం కేంద్రంలో లేకపోవడం ఆందోళనకరమన్నారు. ఇటీవలే కేంద్రంలో మత్స్య, సహకార శాఖలను కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీల కోసం ప్రత్యేక విభాగాలు ఉన్నాయని సభ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రాల మధ్య సమన్వయం కల్పించేందుకు, బీసీల సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు కేంద్ర స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు

©️ VIL Media Pvt Ltd.