ఎస్సీ, ఎస్టీల హక్కుల రక్షణకు ప్రాధాన్యత: నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ/మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల నిరోధానికి, వారి హక్కుల రక్షణకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు, నష్టపరిహారం అందజేత, కేసుల సత్వర పరిష్కారానికి పోలీస్, రెవెన్యూ శాఖలు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దళితవాడలు, తండాల్లో పారిశుధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, టాయిలెట్ల నిర్మాణం చేపట్టడంతో పాటు నాటుసారా నియంత్రణకు పోలీస్, ఎక్సైజ్ శాఖలు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. బాధితులకు ప్రభుత్వ జీవనోపాధి కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. జిల్లాలో 49 కేసులు విచారణలో, 798 కేసులు పెండింగ్ ట్రయల్స్‌లో ఉన్నాయని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శశికళ తెలపగా, ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లాడుతూ బాధితులు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినా తక్షణ చర్యలు ఉంటాయని, ఎస్సై లేకున్నా హెడ్ కానిస్టేబుల్ ద్వారా కేసు నమోదు చేసుకోవచ్చని వివరించారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దళితవాడల్లో సమస్యల పరిష్కారానికి, అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించేందుకు, రుణాలు సకాలంలో ఇచ్చేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. పలువురు సభ్యులు భూ ఆక్రమణలు, పెండింగ్ కేసులు, మౌలిక వసతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సర్ పై ఈ ఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓల తో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పెండింగ్‌లో ఉన్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈనెల 15లోగా సర్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాలన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు.