July 8, 2026

YSR 77th Birth Anniversary: మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం’.. వైఎస్‌ జగన్ ఎమోషనల్ ట్వీట్ వైరల్..

YSR 77th Birth Anniversary: మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం’.. వైఎస్‌ జగన్ ఎమోషనల్ ట్వీట్ వైరల్..
Reading Time: 2 minutes
Ys Jagan Pays Emotional Tribute To Ys Rajasekhara Reddy On His 77th Birth Anniversary

YSR 77th Birth Anniversary: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. తన తండ్రిని స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టు పార్టీ శ్రేణులను, అభిమానులను ఆకట్టుకుంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం” అంటూ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరించుకున్నారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇడుపులపాయలో ఘన నివాళి

జయంతి సందర్భంగా వైఎస్ జగన్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించారు. ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి తన తండ్రికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కూడా జగన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వైఎస్సార్ ఆశయాలు చిరస్థాయిగా నిలవాలని ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

‘రూపాయి డాక్టర్’గా ప్రజల మనసుల్లో స్థానం

1949 జూలై 8న జన్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్య పూర్తి చేసిన అనంతరం ప్రజలకు కేవలం ఒక రూపాయికే వైద్యం అందిస్తూ ‘రూపాయి డాక్టర్’గా గుర్తింపు పొందారు. ప్రజాసేవను మరింత విస్తరించాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజానాయకుడిగా ఎదిగారు. ఇక, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ, ప్రతిపక్ష నేతగానూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడారు. విద్యుత్ చార్జీల పెంపు, రైతుల సమస్యలు, సాగునీటి అంశాలపై ఉద్యమాలు చేపట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్య పెంపు కోసం చేసిన పాదయాత్ర ఆయన ప్రజా ఉద్యమాలకు నిదర్శనం.

2003 పాదయాత్రతో రాజకీయ మలుపు

2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1,673 కిలోమీటర్ల మేర 67 రోజుల పాటు సాగిన వైఎస్సార్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తీసుకొచ్చింది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న ఆయనకు 2004 ఎన్నికల్లో ప్రజలు ఘన విజయం అందించారు. ఇక, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్ సంక్షేమ పథకాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. 2009లో మరోసారి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చి తన ప్రజాసేవను కొనసాగించిన విషయం విదితమే..