రూ.10 లక్షలు అప్పు చేశాడు.. నెలకు లక్షకు రూ.40 వేల వడ్డీ.. అసలు, వడ్డీ కలిపి రూ.83 లక్షలు బాకీ.. చివరికి..

పరిగి, వెలుగు: అధిక వడ్డీకి తెచ్చిన అప్పుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం ఎన్‌కేపల్లికి చెందిన శేరీ శ్రీరాంరెడ్డి ఆత్మహత్య కేసులో 18 రోజులు గడిచినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శ్రీరాంరెడ్డి 2024 జులై 1న పూడూరు మండలం మన్నెగూడకు చెందిన మహమ్మద్ వసీం వద్ద రూ.10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. నెలకు లక్షకు రూ.40 వేల వడ్డీ చొప్పున మూడు నెలల్లో రూ.14 లక్షలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నారు. జులై 16న మరో రూ.5 లక్షలు ఇదే షరతుతో తీసుకున్నాడు.
కొన్ని నెలల తర్వాత అసలు, వడ్డీ కలిపి రూ.83 లక్షలు బాకీ అయ్యిందని చెప్పి, ఆయనకు చెందిన 2.14 ఎకరాల వ్యవసాయ భూమిని వసీం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. గతేడాది అప్పుల ఒత్తిడితో శ్రీరాంరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్సతో ప్రాణాపాయం తప్పింది.
ఇటీవల అప్పుల వేధింపులు ఎక్కువ కావడంతో శ్రీరాంరెడ్డి జూన్ 20న తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణమైన వారి పేర్లను సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. మృతుడి భార్య అశ్విని దోమ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవాలేదని ఆమె ఆరోపించారు.