కళ్లకు గంతలు కట్టి పెన్ క్యాప్ మింగించారు.. కాగజ్ నగర్ ఫూలే బాలికల పాఠశాలలో ఘటన

కాగజ్‌నగర్, వెలుగు: రాత్రి పూట పదో తరగతి స్టూడెంట్ ఒంటరిగా మెట్లు దిగుతుండగా, తోటి స్టూడెంట్స్ ఆమె కళ్లకు గంతలు కట్టి నోట్లో పెన్ను క్యాప్ పెట్టి మింగించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో దహేగాం మండలానికి చెందిన ఉషానీ శ్రుతిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేయడం కలకలం రేపుతోంది. కుటుంబీకులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి భోజనం అయిన తర్వాత శ్రుతి భవనంలోని మెట్లపై నుంచి వస్తుండగా కొందరు ఆమెను వెనుక నుంచి పట్టుకొని కళ్లకు గంతలు కట్టారు. బలవంతంగా పెన్ క్యాప్ నోట్లో వేసి మింగించారు.
ఈ విషయాన్ని హాస్టల్ లో డ్యూటీలో ఉన్న టీచర్ కు చెప్పింది. అదే రాత్రి బాధితురాలి తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వగా, ఆదివారం ఉదయం హాస్టల్ కు చేరుకొని, శ్రుతిని మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎండోస్కోపీ నిర్వహించి కడుపులో ఉన్న పెన్ క్యాప్‌ను తొలగించారు.
హాస్టల్ సిబ్బంది ఈ ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. మంగళవారం విషయం బయటకు పొక్కడంతో హైరానా పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన స్టూడెంట్స్ ఎవరనేది ఇంకా తేలలేదు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు హాస్టల్ కు చేరుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. ఘటనపై ఆరా తీస్తున్నామని రూరల్ సీఐ కుమారస్వామి తెలిపారు.