ములుగు:భూవివాదంలో వ్యక్తిపై గొడ్డలితో దాడి

ములుగు, వెలుగు: భూవివాదంతో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన ములుగు మండలం కొత్తూరు గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్సై చంద్రశేఖర్ వివరాల ప్రకారం కొత్తూరు గ్రామానికి చెందిన అల్లె రమేశ్.. వ్యవసాయంతో పాటు డైరీఫాం నిర్వహించేవాడు. ప్రతీ రోజు సమీపంలోని రాయినిగూడెం పాలకేంద్రంలో పాలు పోస్తూ ఉండేవాడు. కొత్తూరు గ్రామానికే చెందిన గోగుల అయిలయ్య గొర్రెల కాపరి. రమేశ్, అయిలయ్యకు పంటపొలాలు పక్కపక్కనే ఉండగా ఏడాది కాలంగా భూమి హద్దుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది.
మంగళవారం ఉదయం రమేశ్ పాలు పోసేందుకురాయినిగూడెం వెళ్తుండగా అయిలయ్య తన వద్ద ఉన్న గొడ్డలితో దాడి చేశాడు. రమేశ్ కింద పడిపోగా.. గ్రామస్తులు అయిలయ్యను అడ్డుకున్నారు. తీవ్ర గాయాలైన రమేశ్‌ను కుటుంబ సభ్యులు 108లో ములుగు హాస్పిటల్‌కు తరలించారు. బాధితుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా గ్రామానికి వచ్చిన ఎస్సై చంద్రశేఖర్ సాక్షులను విచారించారు. బాధితుల ఇంటివద్దనే ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాడికి పాల్పడ్డ అయిలయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రమేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.