R Madhavan: అందమైన హీరోయిన్ల మధ్య ఉన్నా భార్యను ఎందుకు మోసం చేయలేదో చెప్పిన స్టార్ యాక్టర్!

R Madhavan: సినీ పరిశ్రమలో ఎఫైర్లు, విడాకులు చాలా సర్వసాధారణం అయిపోయిన ఈ రోజుల్లో.. ఒకప్పటి స్టార్ హీరో, ఇప్పటి స్టార్ యాక్టర్ ఆర్.మాధవన్ తన 27 ఏళ్ల వైవాహిక బంధంపై చేసిన వ్యాఖ్యలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ, అత్యంత అందమైన నటీమణులతో కలిసి నటిస్తున్నప్పటికీ, తన భార్య సరితను మోసం చేయాలనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి, సంసార జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ మాధవన్ చాలా నిజాయితీగా, ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ఒక రకంగా చెప్పాలంటే కొంచెం భయస్తుడిని. అందమైన అమ్మాయిలు నన్ను ఆకర్షించినా.. నా భార్యకు అన్యాయం చేసి, ఆ తర్వాత వచ్చే పరిణామాలను లేదా సాకులు వెతుక్కునే ఇబ్బందులను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా లేను. రోజు ముగిసేసరికి ఎలాంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా నా భార్య దగ్గరకు వెళ్లిపోవడమే నాకు ఇష్టం. దేవుడు ఇచ్చిన ఒకే ఒక్క మంచి భార్య నాకు చాలు” అని మాధవన్ పేర్కొన్నారు.
మొదటి నుంచే తమ బంధంలో పూర్తి పారదర్శకత ఉందని, తన ఫోన్ పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ తన భార్య సరిత దగ్గరే ఉంటాయని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో పెళ్లి విషయాన్ని దాచమని కొందరు సలహా ఇచ్చినప్పటికీ, తాను పెళ్లయిన విషయాన్ని గర్వంగా ప్రకటించానని గుర్తుచేసుకున్నారు. షూటింగ్‌ల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు కూడా భార్యను తనతో పాటు తీసుకెళ్లేవాడినని, అలా ఎందుకు చేసేవాడినంటే అనవసరమైన ప్రలోభాలకు గురికాకుండా ఉండటానికే అంటూ మాధవన్ సరదాగా వ్యాఖ్యానించారు. మాధవన్, సరిత జంటకు వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు.