Reading Time: < 1 minute
Ys Jagan Pays Tribute To Ys Rajasekhara Reddy On His 77th Birth Anniversary At Idupulapaya

YS Jagan: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాయి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు.. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నేతలు కూడా వైఎస్‌ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించగా, పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు, నివాళి సభలను ఏర్పాటు చేశాయి.

ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వైఎస్‌ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం తన తండ్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి పాల్గొన్నారు. అలాగే వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్సార్‌కు నివాళులర్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా జయంతి వేడుకలు

వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పార్టీ నాయకులు రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, మొక్కల నాటకం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు కూడా పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. మరోవైపు.. ఇతర పార్టీల నేతలు కూడా వైఎస్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు..