Reading Time: 2 minutes
Good News For Telangana Ap Rail Passengers 3 Special Trains Converted To Regular Services

Indian Railways: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ఇచ్చింది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చాలని ఇండియన్‌ రైల్వే నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా 91 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ప్రధానంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్ల నుంచి నడుస్తున్నాయి. అయితే, ఇప్పటికే నడుస్తున్న కొన్ని స్పెషల్ ట్రైన్లను ప్రయాణికుల డిమాండ్ మేరకు రెగ్యులర్ ట్రైన్లుగా మార్చారు.

కాచిగూడ – ట్యూటికోరిన్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 07191/07192 కాచిగూడ–మధురై స్పెషల్ రైలును ఇప్పుడు 17165/17166 కాచిగూడ–ట్యూటికోరిన్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయలుదేరి మంగళవారం రాత్రి 10:45 గంటలకు ట్యూటికోరిన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం ఉదయం బయలుదేరి గురువారం మధ్యాహ్నం కాచిగూడ చేరుకుంటుంది.

హైదరాబాద్ – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
రైలు నం. 07230/07229 హైదరాబాద్–కన్యాకుమారి స్పెషల్ రైలును ఇప్పుడు 17069/17070 రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున కన్యాకుమారి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శుక్రవారం ఉదయం బయలుదేరి శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటుంది.

చర్లపల్లి – షాలిమార్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 07225/07226 చర్లపల్లి–షాలిమార్ స్పెషల్ రైలును ఇప్పుడు 17065/17066 Amrit Bharat Express గా మార్చారు. ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి బుధవారం ఉదయం షాలిమార్‌ రైల్వే స్టేషన్‌కు (పశ్చిమ బెంగాల్) చేరుకుంటుంది.

ఇక, ఈ నిర్ణయంపై కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి Ashwini Vaishnaw కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి ₹36,286 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించగా ప్రస్తుతం ₹47,984 కోట్ల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా రూ. 2,668 కోట్లతో రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను Amrit Bharat Station Scheme కింద ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు కిషన్‌ రెడ్డి..