
టెహ్రాన్/దుబాయి: పశ్చిమాసియాలో రెండు వర్గాలు మంగళవారంనాడు పరస్పరం దాడులను మరింత ఉధృతం చేశాయి. గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ లక్షంగా ఇరాన్ దాడులకు పాల్పడగా.. టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా విధ్వంసం సృష్టించా యి. బహ్రెయిన్ రాజధాని మనామాపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో 29 ఏళ్ల మహిళ మరణించింది. ఓ భవంతి పాక్షికం గా దెబ్బతింది. బహ్రెయిన్ కూడా దాడిని ధ్రువీకరించింది. సౌదీ అరేబియాలోని తూ ర్పు ప్రాంతంలో చమురు క్షేత్రాలే లక్షంగా ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది. రువాయిస్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్ని మాపక దళాలను రంగంలోకి దించారు. అయితే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లలో రెండింటిని కూల్చివేసినట్లు సౌదీ ప్రకటించింది. ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని కూడా తె లిపింది. కువైట్‌పై కూడా ఇరాన్ డ్రోన్ దా డులకు పాల్పడిందని, అయితే వాటిల్లో ఆరు డ్రోన్లను కూల్చివేసినట్లు కువైట్ ఒక ప్రకటనలో తెలిపింది.
జెరూసలెం, టెహ్రాన్‌లలోనూ వరుస పేలుళ్లు, సైరన్ల శబ్ధాలు వినపడ్డాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ సమర్థవంతంగా అడ్డుకుందని ప్రకటించారు. ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతం లో ఉన్న అమెరికా కాన్సులేట్‌పై కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇక్కడి అమెరికా ఎయిర్‌బేస్ లక్షంగా కూడా దాడులు చేసినట్లు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. ఇరాన్ దాడులను యుఎఇ తీవ్రంగా ఖండించింది. దౌత్య కార్యాలయాలను ల క్షంగా చేసుకోవడం సరైంది కాదని మండిపడింది. అదే విధంగా ఈ యుద్ధంలో తమ దేశాన్ని లక్షంగా ఎంచుకోవడాన్ని కూడా ఖండించింది. ఖతార్ రాజధాని దోహాలోకూడా భారీ శబ్దాలు వినపడ్డాయి. ఇది ఇరాన్ పనేనని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని దోహా యంత్రాంగం సూచించింది. యుఎఇలో జరిపిన దాడుల్లో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఓ అమెరికా సైనికుడు కూడా మృత్యువాత పడ్డట్లు ప్రకటించారు.
ఇరాన్ కెర్మన్ విమానాశ్రయంపై దాడులు..
ఇరాన్‌లోని కెర్మన్ విమానాశ్రయంపై మంగళవారంనాడు అమెరికాఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరిపాయి. విమానాశ్రయంతో పాటు కొన్ని విమానాలు కూడా ధ్వంసమైనట్లు స్థానికి మీడియా తెలిపింది. కెర్మన్ ప్రావిన్స్ గవర్నర్ కార్యాలయం కూడా దీన్ని ధ్రువీకరించింది. ఇప్పటికే మెహ్రాబాద్ విమానాశ్రయాన్ని కూడా ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించి దెబ్బతీసింది. మరోవైపు హెజ్బొల్లాలు లక్షంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐదుగురు మృతి చెందారు. మిలిటెంట్లకు ఆర్థిక కేంద్రంగా ఉన్న అల్ ఖర్ద్ అల్ హసన్‌ను నేలమట్లం చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. టెహ్రాన్‌లోని కీలక ప్రాంతాలపై సంయుక్త బలగాలు దాడులు చేసినట్లు సమాచారం.