
న్యూఢిల్లీ : దేశీయంగా ఉత్పత్తి చేసే నాచురల్ గ్యా స్‌ను ఇప్పుడు ప్రాధాన్యత ఆధారంగా సరఫరా చేయనున్నారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టా కేంద్ర ప్రభుత్వం అత్యవసర వస్తువుల చట్టాన్ని అమలు చేసింది. దేశంలో వం ట గ్యాస్ సరఫరా నిలిచిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపా రు. ఇప్పటివరకు వాహనాలకు ఉపయోగించే సి ఎన్‌జి (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్), ఇళ్లకు పైప్ ద్వారా వచ్చే గ్యాస్ ఈ రెండింటిని మాత్రమే ప్రా ధాన్యత రంగాలుగా నిర్ణయించారు. ఇప్పుడు వం ట గ్యాస్‌ను కూడా ప్రాధాన్య జాబితాలో చేర్చారు. సిఎన్‌జి, ఎల్‌పిజి మొదటి ప్రాధాన్యతగా నిర్ణయించగా, దీనిని గత 6 నెలల సగటు వినియోగానికి సమానంగా గ్యాస్ అందించాలనే ఆదేశాలు జారీ చేశారు. రెండోది ఎరువుల కర్మాగారాలకు 70 శాతం గ్యాస్ అందించనున్నారు. మూడో సె క్టార్ విషయానికొస్తే, టీ పరిశ్రమలు, ఇతర కర్మాగారాలకు 80% సరఫరా చేయాలని నిర్ణయించారు. వంట గ్యాస్ కొరత రాకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర అధికారులు వెల్లడించారు.
రెస్టారెంట్లకు వంట గ్యాస్ కొరత
దేశంలో వాణిజ్య వంట గ్యాస్ కొరత పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు ఇబ్బందులు పెరిగాయి. ప్రభుత్వం విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి ప్రాధాన్య రంగాలకు మాత్రమే గ్యాస్ సిలిండర్లు ముందుగా అందించాలనే నిర్ణయం తీసుకుంది. దీంతో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై వంటి పెద్ద నగరాల్లో రెస్టారెంట్ల కార్యకలాపాలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని పరిశ్రమ ప్రతినిధులు హెచ్చరించారు. సాధారణంగా రెస్టారెంట్లు ఎక్కువ నిల్వలు చేసుకోలేదు. దీంతో రెస్టారెంట్లు మెనూలను తగ్గించడం, పని గంటలను తగ్గించడం లేదా తాత్కాలికంగా మూసివేయడం గురించి ఆలోచిస్తున్నాయి. గ్యాస్ కొరత కొనసాగితే ఆహార పంపిణీ సేవలపై కూడా ప్రభావం పడవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం అక్రమ నిల్వలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. గ్యాస్ బుకింగ్ మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది.
— అత్యవసర వస్తువుల చట్టం అమలు ఎందుకు?
దేశంలో వంట గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండటంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 31 మిలియన్ టన్నుల వంట గ్యాస్ వినియోగం ఉండగా, దేశీయ ఉత్పత్తి కేవలం 12 మిలియన్ టన్నుల వరకు మాత్రమే ఉంది. దీనివల్ల విదేశాల నుంచి గ్యాస్‌ను భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. యుద్ధ పరిస్థితులు కొనసాగితే సరఫరా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఈ చట్టం ద్వారా నిల్వలు నియంత్రించడం, సరఫరాను మార్గనిర్దేశం చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.
క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ 8 శాతం డౌన్
అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవడంతో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. మూడు రోజుల పెరుగుదలకు ముగింపు పలుకుతూ చమురు ధరలు 8 శాతానికి పైగా తగ్గాయి. దేశీయ వస్తువుల మార్పిడి మార్కెట్లో ఒక బారెల్ చమురు ధర రూ.8,069 పడిపోయింది. యుద్ధ పరిస్థితులు తగ్గే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించడంతో మార్కెట్‌లో భయాలు తగ్గాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముందుగా సరఫరా అంతరాయం ఉంటుందనే భయంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఒక దశలో బారెల్ ధర రూ. 10 వేలకు పైగా చేరింది. అయితే యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుతాయని సంకేతాలు రావడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అవసరమైతే నిల్వల నుంచి చమురు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక మంత్రులు కూడా తెలిపారు.