Reading Time: 3 minutes

మనతెలంగాణ/హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుకు చట్టబద్ధత క ల్పించాలని అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆ ర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఈ బడ్జెట్ ద్వారా ఎంత కేటాయించారో బహిర్గతమవుతుందని అన్నారు. అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ… ఆ హామీని, ఆ మాటను మరిచిపోయిందని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఈ బిల్లు ద్వారా ఎండగడతామని అన్నారు. 6 గ్యారంటీలలో పేర్కొన్న మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, రైతన్నలు వంటి తెలంగా ణ సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మో సం నేపథ్యంలో… ఆయా వర్గాల తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తె లిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మొదట క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత కలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భం గా కెటిఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ స భ్యులు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి 60శాతం సమయం అయిపోతుందని తెలిపారు. గండిపేటలోని గోల్కొండ రిస్టార్ట్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల ఉమ్మడి ఓరియెంటేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి, పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలో తాము విశ్లేషణ చేసుకున్నామన్నారు. అలాగే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే అంకెల గారడీలపై కూడా విశ్లేషించామని తెలిపారు.

తమ పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, బండ ప్రకాష్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి తదితరులు మాట్లాడారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీ కమిటీలు ఏమీ లేవని విమర్శించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని తమ పార్టీ నుంచి ద్రోహం చేసి పోయిన వ్యక్తికి ఇచ్చారని పేర్కొన్నారు. ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, పిటిషన్స్ కమిటీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీ నడపాలని లేదని, అందుకే తూతూ మంత్రంగా ఈ అసెంబ్లీ సమావేశాలను నడుపుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిందని…కానీ, ఇచ్చిన హామీలకు చట్టబద్ధత ఏమైందంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు.

అసెంబ్లీలోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్‌ని ప్రయోగిస్తున్నారు

రాష్ట్రంలో కాంగ్రెస్ పెడుతున్న ఈసారి మూడవ బడ్జెట్ ప్రవేశపెడుతుందని, ఈ బడ్జెట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే సగం ప్రభుత్వ పదవీ కాలం అయిపోయిందని, హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపోయిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్‌ని ప్రయోగిస్తున్నదని మండిపడ్డారు. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో పచ్చిగా అబద్ధాలను, అసత్యాలను మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ తూతూమంత్రంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నదని ఆరోపించారు.

రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టారని ఆరోపించారు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకం వల్ల ఇళ్లు కోల్పోయిన ఖమ్మం వెలుగుమట్ల తరపున, మూసీ బాధితుల తరపున, పేద దళిత గిరిజన ప్రజల కోసం ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళిత, గిరిజన, బిసి, మైనారిటీ వర్గాలకు ఇస్తామన్న నిధులు ఎందుకు కేటాయించలేదో నిలదీస్తామని పేర్కొన్నారు. దీంతోపాటు ఆయా వర్గాలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. శాసనమండలి, శాసనసభ మధ్య తమ పార్టీ సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.

మూసీ పేరుతో మూటల వేటకు వ్యతిరేకం

మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని.. కానీ, ఆ పేరుతో జరిగే మూటల వేటకే తాము వ్యతిరేకమని కెటిఆర్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు, 420 హామీల అమలుకు, రైతన్నలకు, మహిళలకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలకు డబ్బులు లేవని ప్రభుత్వం చెబుతున్నదని… కానీ, వీటన్నింటినీ పక్కన పెట్టి మూసీ పేరుతో అవినీతి కార్యక్రమానికి తెరలేపిందని అన్నారు. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తాము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు… కానీ, ఒకవైపు డబ్బులు లేవు, అప్పులయ్యాయని చెబుతూనే మూసీలో లక్షన్నర కోట్ల రూపాయల అవినీతితో లక్షలాది మంది ఇళ్లను కూలగొట్టడాన్ని మాత్రమే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేయడం లేదు అని, కేవలం ఢిల్లీకి డబ్బులు పంపించడం కోసమే మూసీ ప్రాజెక్టును చేపడుతున్నారని ఆరోపించారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసీలో జరిగే లక్షల కోట్ల రూపాయల అవినీతికి వ్యతిరేకం అని స్పష్టం చేశారు.

మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను జీరో వ్యాల్యూ చేయడం కాదు, అసలు జీరో వ్యాల్యూ ఎవరికైనా ఉన్నది అంటే అది రేవంత్ రెడ్డికే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాటలకు ముమ్మాటికీ జీరో విలువ ఉన్నదని అన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు అని, తాను తీసుకున్న నిర్ణయాలు కూడా తనకే తెలియదని చెబుతున్నారని విమర్శించారు. డే ఎకానమీని నాశనం చేసిన వ్యక్తి నైట్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రాహుల్ బంధు పథకాన్ని పక్కన పెట్టి రైతు బంధు కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. రెండున్నర సంవత్సరాలలో ఒక్క ఇల్లు అయినా కాంగ్రెస్ పార్టీ కట్టిందంటే తాను రాజీనామా చేస్తానని చెప్పానని, దానికి తాను ఇంకా కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాము కట్టిన ఫ్లైఓవర్లు, ఇళ్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి మావి అని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని కెటిఆర్ విమర్శించారు.