
మనతెలంగాణ/హైదరాబాద్: కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చే స్తోందని ‘గోదావరి పుష్కరాలు 2027’ కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ కు మరింత పేరు తెచ్చేలా మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. మంగళవారం డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన కమిటీ తొలి స మావేశంలో సభ్యులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొండా సురేఖ,
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిలు పాల్గొన్నారు. పుష్కర నిర్వహణ తేదీలు, సంబంధిత శాఖల సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణను సమీక్షించి అధికారులకు సబ్ కమిటీ దిశా నిర్దేశం చేసింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సరస్వతీ పుష్కరాలు, సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిందన్నారు. అదే స్ఫూర్తితో మరింత రెట్టించిన ఉత్సాహంతో రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు….
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహించాలని వేద పండితులు నిర్ణయించారన్నారు. సుమారు 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు తరలివచ్చే అవకాశముందని, అందుకు అనుగుణంగానే గోదావరి ప్రవహించే జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశామన్నారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆయా చోట్ల క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర, జిల్లా ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వేగంగా పనుల్ని ప్రారంభించేలా ముమ్మర కసరత్తు చేస్తున్నామన్నారు.
ఈ నెల చివరి నాటికి డిపిఆర్‌లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. తొలి దశలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రద్దీ అధికంగా ఉండే తొమ్మిది ప్రాంతాలను ‘టైర్ -1’ కింద ఎంపిక చేశామన్నారు. సమన్వయలోపం తలెత్తకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. ప్రతి ఘాట్ దగ్గర ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ఎమర్జెన్సీ రూట్, ఆధునిక వైద్య సౌకర్యాలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. పుష్కర ఏర్పాట్లలో రాజీపడే ప్రసక్తే లేదని, పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అత్యంత పకడ్బందీగా వ్యవహారించాలని అధికారులను కేబినెట్ సబ్‌కమిటీ ఆదేశించింది.