Reading Time: < 1 minute

కేంద్ర మంత్రివర్గం మంగళవారంనాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.8 లక్షల కోట్లు కేటాయించింది. జల్ జీవన్ మిషన్‌ను 2028 డిసెంబర్ వరకు పొడిగించింది. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ పథకం గ్రామీణ భారతంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా సురక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించింది. ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్రం సాయంగా మరో రూ.3.59 లక్షల కోట్లను అందించాలని నిర్ణయించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడుకు సంబంధించి కూడా కేబినెట్ కీలక నిర్ణయం వెలువరించింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ముధురై ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ప్రపంచంతో ఆ పట్టణాన్ని అనుసంధానిస్తామని అన్నారు.

తద్వారా విద్యా, ఆరోగ్య హబ్‌గా మధురై త్వరలో మారబోతోందని అన్నారు. సంత్రాగచ్చి-ఖరగ్‌పూర్ మద్య రూ.2,905 కోట్లతో నాలుగు లైన్ల రహదారి, రూ.3,839 కోట్లతో బద్నావర్-థాండియా-తిమర్వానీ మధ్య 5 లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోదించినట్లు అశ్విని వివరించారు. రూ.3,631 కోట్లతో జెవార్ విమానాశ్రయం-, ఫరీదాబాద్ సెక్షన్‌ను కలిపే 6 లైన్ల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపామన్నారు. అదే విధంగా భారత్‌తో సరిహద్దు పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డిఐలపై కూడా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో అన్ని దేశాలకు నిబంధనలు సరళతరం చేశామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్న అనుమతి తీసుకోవాలన్న నిబంధనను తొలగిస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు ప్రెస్‌నోట్3ని సవరించామని తెలిపారు.