
ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయేది ఎవరంటే.. ఇరాన్, దాని చుట్టు పక్కల దేశాలే అనుకున్నారు చాలా మంది. కానీ యుద్ధం ప్రభావంతో ప్రపంచమే స్తంభించే పరిస్థితి ఇప్పుడు. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, గ్యాస్ సప్లై నిలిచిపోవడంతో చాలా దేశాల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. ఇండియాలో ఎల్పీజీ సిలిండర్ల కొరతతో మెట్రో నగరాల్లో హోటల్స్ మూసివేసే పరిస్థితి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లు మూత పడుతుండటంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో కేంద్రంపై విమర్శలకు దిగాయి. యుద్ధం గురించి ముందే తెలిసినా కేంద్రం నిర్లక్ష్యం కారణంగా దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తునాయి.
గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం ఏర్పడకూడదని నిత్యావసరాల వస్తువుల చట్టం (EC Act) అమలులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. గ్యాస్ సప్లైలో అంతరాయం ఏర్పడకూడదని ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ యూనిట్స్ ను ఆదేశించింది కేంద్రం. గృహ వినియోగం, హోటల్స్ వంటి సెక్టార్స్ కు ఎల్పీజీ సప్లై ఎలాంటి అంతరాయం లేకుండా జరగాలని.. గత ఆరు నెలలుగా ఎలాంటి సరఫరా ఉందో అదే విధంగా 100 శాతం సప్లై జరగాలని కేంద్రం ఆదేశించింది.
గ్యాస్ కొరతపై కాంగ్రెస్, శివసేన, సమాజ్ వాదీ పార్టీలు తీవ్ర స్థాయిలో కేంద్రంపై విమర్శలకు దిగాయి. సిటీల్లో బుకింగ్స్ ముందు 25 రోజులు కస్టమర్లు ఎదురు చూడాల్సి రావడమేంటని ప్రశ్నిస్తున్నాయి.
కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ దీనికి పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి అన్నారు. పశ్చిమ ఆసియాలో ఏర్పడిన సంఘర్షణతో సామాన్యుడు వంట చేసుకోవడం కూడా కష్టంగా మారిందని అన్నారు. దీనికి కారణం కేంద్ర నిర్లక్ష్యమేనని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం ఎల్పీజీ ధరలను ముందుగానే పెంచుతుంది. యుద్ధం అలాగే తొమ్మిది పది రోజులు కొనసాగుతుంది. గ్యాస్ షార్టేజ్ ఏర్పడుతుంది. అప్పడు సిటీల్లో 25 రోజుల ముందు గ్యాస్ బుకింగ్ ఉండదని నిబంధనలు విధిస్తారు. ఏం డ్రామాలు ఆడుతున్నారు అంటూ విమర్శలకు దిగారు. దీనంతటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
యుద్ధం వస్తుందంటే ముందునుంచే సిద్ధంగా ఉన్నాం.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం.. అంటూ డంబాలు పలికిన మోదీ ప్రభుత్వం..ఇప్పుడు గ్యాస్ సప్లై లో అంతరాయంపై మాట్లాడాలంటూ శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శలకు దిగారు. అంతా సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పుడు.. ప్రజలకు గ్యాస్ కొరత ఎలా ఏర్పడిందని మండిపడ్డారు.
యుద్ధం లేని సమయంలో.. ప్రశాంతంగా ఉన్న సమయంలో.. మేము సిద్ధంగా ఉన్నాం.. ఎలాంటి ఇబ్బందులనైనా ఎందుర్కుంటాం అంటారు. యుద్ధ సమయంలో.. సారీ మేము ఏమీ చేయలేం అంటారు. జుమ్లాలు చెప్పడం మనకు కొత్త కాదు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
In peacetime: we are prepared for all and any kind of disruptions
In wartime: sorry we can’t help. Thing we spoke were jumlasTrump was making enough noise about Iran, PM visited Israel 2 days prior to the war, yet we have a GoI that again comes across as underprepared and… https://t.co/6GlLVK5xY0
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) March 10, 2026
దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమే..
ఒకవైపు హార్మూజ్ జలసంధి మూతపడి గ్యాస్, ఆయిల్ సరఫరాకు ఆటకం ఏర్పడితే.. మనకు చమురు కొరత లేదని.. గ్యాస్ పుష్కలంగా ఉందని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ షార్టేజ్ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం.. మనకు సరిపడినంత ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉందని చెబుతోంది. ఇండియాకు 80 శాతం క్రూడ్ ఆయిల్ హార్మూజ్ జలసంధి నుంచే వస్తుంది. ప్రస్తుం అది మూత పడింది. ప్రభుత్వం తప్పుడు ప్రకటనల వల్ల.. దేశం తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తోంది.. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థికంగా మరింత దిగజారే పరిస్థితి ఉంటుందంటూ మండిపడ్డారు.