Reading Time: < 1 minute

హైదరాబాద్: రెండో భార్య, ఆమె ప్రియుడిని చంపాలని సుపారీ ముఠా కోసం వెతుకుతుండగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పాతబస్తీలో ఓ వ్యాపారి భార్య అనారోగ్యానికి గురకావడంతో ఆమె మంచానికే పరిమితమైంది. దీంతో అతడు రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. భార్య చెల్లిని పెళ్లి చేసుకొని జీవితం సాపీగా కొనసాగుతోంది. రెండో భార్య మరో వ్యక్తితో చనువుగా ఉన్నట్టు గుర్తించాడు. అనుమానంతో పలుమార్లు భార్యను పద్దతి మార్చుకోవాలని సూచించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో రెండో భార్యతో పాటు ఆమె ప్రియుడిన చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. బిహార్ రాష్ట్రం నుంచి నాటు తుపాకీని కొనుగోలు చేశాడు. నగరంలో నిర్మానుష్య ప్రదేశంలో నాటు తుపాకీతో కాల్చటం సాధన చేశాడు. ఆ ఇద్దరిని చంపడానికి సుపారీ ముఠా కోసం వెతకడం ప్రారంభించాడు. పోలీసులు పాత నేరస్థుల అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తుండగా ఈ విషయం బయటకు తెలియడంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అతడితో మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.