
దక్షిణాసియా ఓ శక్తివంతమైన కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావాన్ని చూస్తోం ది. జనరేషన్ జెన్ అనే యువతరంగం. విరామం లేని, డిజిటల్‌గా మమేకమై, అసహన తరం. స్మార్ట్ ఫోన్‌లు, సోషల్‌మీడియా, గ్లోబల్ కనెక్టివిటీ యుగంలో ఆవిర్భవించిన ఈ తరం దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించిన రాజకీయ స్తబ్దత, అవినీతి, వంశపారంపర్య అధికార వ్యవస్థలను అంగీకరించడానికి సిద్ధంగా లేదు. నేపాల్‌లో ఈ మధ్య జరిగిన ఎన్నికలు ఈ తరం మార్పునకు ఓ అద్భుతమైన ఉదాహరణ. బాలేంద్ర షా విజయం, యువత నడిపే రాజకీయ ఉద్యమం విస్తరణ నేపాల్ సాంప్రదాయ రాజకీయ వ్యవస్థను కూల్చివేసింది. అదే సమయంలో, బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలు విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ప్రయోగం నిరసనలను రాజకీయ శక్తిగా మరల్చడంలో విఫలమైంది. నేపాల్‌కు విరుద్ధమైన కథ ఇది. ఈ కథనాలు పెద్ద ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. జనరేషన్ జెన్ భారతదేశంతో సహా దక్షిణాసియా అంతటా రాజకీయాలను పునర్నిర్మించగలదా. నేపాల్‌లో ఈ మధ్య జరిగిన ఎన్నికలు ఓ రాజకీయ భూకంపం వంటివే. దశాబ్దాలుగా నేపాల్ రాజకీయం సాంప్రదాయ పార్టీలు, అనుభవజ్ఞులైన నాయకుల ఆధిపత్యంలో సాగేవి. నేపాలీ కాంగ్రెస్ వర్గాలు, కె.పి.శర్మ ఓలి వంటి ప్రముఖుల నేతృత్వంలో కమ్యూనిస్ట్ గ్రూప్‌ల మధ్య రాజకీయ అధికారం ఊగిసలాడింది. 2008లో రాచరిక వ్యవస్థ రద్దయి గణతంత్ర రాజ్యాంగం ఆమోదం పొందినా, వ్యవస్థ మారలేదు.
నేపాల్ లో రాజకీయ వ్యవస్థ ఒక ఉన్నత వర్గం నుంచి మరో ఉన్నత వర్గానికి బదలీ అయిందని చాలామంది నేపాలీ పౌరులు భావించారు. అవినీతి, కుంభకోణాలు, వర్గపోరు, దీర్ఘకాలిక అస్థిరత ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న యువ నేపాలీల నిరాశ నిసృ్పహలు తారస్థాయికి చేరాయి. నేపాల్‌లో జనరేషన్ జెన్ కొత్త తరహా రాజకీయాలను కోరింది- పారదర్శకంగా, జవాబుదారీగా, దేశపాలనను నియంత్రించిన పాలకులనుంచి విముక్తి పొందింది. ఇందుకు సోషల్ మీడియా ప్రధాన సాధనంగా మారింది. కార్యకర్తలు నిరసనలు నిర్వహణకు, సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి, రాజకీయ సంకేతాలను అనూహ్యమైన వేగంతో సమన్వయం చేయడంలో వీలు కల్పించింది. డిజిటల్ లాండ్ స్కేప్ నేపాలి యువతలో కొత్తరాజకీయ చైతన్యాన్ని సృష్టించడంలో కీలకం అయింది. పట్టణాలలోని కార్యకర్తలు, విద్యార్థులు, యువ నిపుణులను శక్తివంతమైన సమష్టి శక్తిగా ఏకంచేసింది. ఈ పరిణమాలనుంచి బాలేంద్ర షా అనే యువ తరంగం ఉద్భవించాడు. అందరూ బాలెన్ అని పిలిచే, రాపర్, ఇంజనీర్, ఆతర్వాత కాలంలో ఖాట్మండు మేయర్ అయిన బాలేంద్ర షా, సాంప్రదాయ రాజకీయ తరగతికి పూర్తి భిన్నంగా ప్రాతినిధ్యం వ్యవహరించాడు.
యువకుడు, నిష్కపటంగా మాట్లాడేవాడు కావడం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అతడు నేపాల్ పట్టణ యువత ఆకాంక్షలను నేరుగా తీర్చాడు. అతడి ఆవిర్భావం దశాబ్దాలుగా నేపాల్‌పై ఆధిపత్యం సాగించిన పాత రాజకీయ సంసృ్కతి నీరుగారిపోయింది. బాలెన్ షా రాజకీయ విజయం యాదృచ్ఛికం కాదు. అతడి ప్రచారం యువత నిరసన శక్తిని సమర్థంగా ఉపయోగించుకుంది. దానిని ఒక వ్యవస్థీకృత ఎన్నికల ఉద్యమంగా మార్చింది. సోషల్ మీడియా కీలక పాత్ర, అట్టడుగు వర్గాల సమీకరణ, సుపరిపాలన, అవినీతి నిరోధక సంస్కరణలతో కేంద్రీకృతమైన సందేశంతో బాలేంద్ర షా, అతని మిత్రులు నేపాల్‌లో రాజకీయ పార్టీలకు దీటైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించడంలో విజయం సాధించారు. నేపాల్ ఎన్నికల ఫలితాలు సాంప్రదాయ రాజకీయ ఉన్నత వర్గాలపట్ల ప్రజల సంతృప్తిని ఎత్తిచూపాయి. దశాబ్దాలలో మొదటిసారిగా, నేపాల్ ప్రధాన పార్టీల దీర్ఘకాలిక ఆధిపత్యం, యువత క్రియాశీలతతో తలెత్తిన కొత్త రాజకీయశక్తినుంచి తీవ్రమైన సవాలు ఎదుర్కొంది. షా విజయం ఒకప్పుడు నిరసనల ద్వారా తమ కోపాన్ని వ్యక్తం చేసిన తరం ఇప్పుడు అధికార రాజకీయ రంగంలో అడుగు పెట్టడాన్ని సూచిస్తోంది.
అదే సమయంలో బంగ్లాదేశ్‌లో యువరాజకీయాలు భిన్నమైన పంథాను అనుసరించాయి. బంగ్లాదేశ్‌లో కూడా యువత, విద్యార్థుల తీవ్రమైన ప్రతిఘటనలు ఎదుర్కొన్నా, గతంలో ప్రభుత్వాన్ని తొలగించిన రాజకీయ సంక్షోభానికి దోహదపడింది. ప్రజాస్వామ్య సంస్కరణలు, జవాబుదారీ తనం, సమగ్ర రాజకీయ వ్యవస్థను డిమాండ్ చేస్తూ యువ నిరసనకారులు వీధులకు ఎక్కారు. ఒక దశలో బంగ్లాదేశ్ వాసులు కూడా నేపాల్ మాదిరిగానే తరాల రాజకీయ మార్పునకు శ్రీకారం చుడతారని అన్పించింది. కానీ, బంగ్లా విద్యార్థులు, కార్యకర్తలు తమ ఉద్యమాన్ని రాజకీయ శక్తిగా తీర్చే యత్నం చేశారు. కానీ ఎదురైన సవాళ్లు బలీయంగా అన్పించాయి. పటిష్టమైన నాయకత్వ నిర్మాణం, దేశవ్యాప్తంగా రాజకీయ నెట్‌వర్క్ లేకపోవడం వల్ల విద్యార్థి ఉద్యమం ఎన్నికల విజయానికి అవసరమైన సంస్థాగత రూపాన్ని నిర్మించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. బిఎన్‌పి పునరాగమనం, ప్రభుత్వ మార్పును సూచిస్తున్నా, యువత ఆశించిన పరివర్తనను అది పాదుకొల్పలేదు. బంగ్లాదేశ్ అనుభవం నిరసన ఉద్యమాలను స్థిరమైన రాజకీయ సంస్థలను మార్చడంలో ఎదురయ్యే ఇబ్బందులను చెప్పక చెబుతోంది.
నేపాల్, బంగ్లాదేశ్‌లలో ఎదురైన విభిన్నమైన ఫలితాలు, యువత రాజకీయాల గురించి ఓ ప్రాథమిక సత్యాన్ని వివరిస్తాయి. సామూహిక నిరసనలు, రాజకీయ వ్యవస్థలను సవాల్ చేయగలవు కానీ, మార్చలేవు. విశ్వసనీయమైన నాయకత్వం, స్పష్టమైన దృక్పథం, ఎజెండాతో నిసనలు రాజకీయ ఉద్యమాలుగా పరిణామం చెందకపోతే, ఉన్న వ్యవస్థ స్థానే కొత్త వ్యవస్థను నిర్మించలేవు. నేపాల్‌లోని జనరేషన్ జెడ్ తిరుగుబాటు యువతశక్తిని ఎన్నికల రాజకీయాల్లో ప్రవేశపెట్టగల నాయకుడిని తయారు చేయడం వల్లే విజయవంతం అయ్యాయి. ఇందుకు విరుద్ధంగా, బంగ్లాదేశ్ ఉద్యమం ఆ కీలక అంశాన్ని గ్రహించనందువల్ల కుంటుపడింది. భారతదేశం పరిస్థితికి వస్తే, ఈ పరిణామాలు అనివార్యంగా పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభాగలదేశం. భారతదేశ జనరేషన్ జెడ్ అపారమైన శక్తిని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువ భారతీయులు రాజకీయ రంగంలో ప్రవేశిస్తున్నారు. డిజిటల్ కనెక్టివిటీ, ప్రపంచ అవగాహనపై కొత్త అంచనాలను కల్పిస్తున్నారు. భారతదేశం గతంలో యువత నేతృత్వంలో శక్తివంతమైన ఉద్యమాలు సాగాయి. 2011 అవినీతి వ్యతిరేక నిరసనలు పట్టణ ప్రాంతాలలో యువతను ఏకం చేశాయి. చివరికి కొత్త రాజకీయ నటుల ఆవిర్భావానికి దోహద పడ్డాయి. యూనివర్శిటీలలో విద్యార్థుల నిరసనలు పదేపదే ప్రభుత్వ విధానాలను సవాల్ చేశాయి. యువ పౌరులలో పెరుగుతున్న రాజకీయ ఆసక్తిని హైలైట్ చేశాయి.
అయినా, భారతదేశ రాజకీయ వ్యవస్థ, నేపాల్ కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. అతి పెద్ద దేశం, ఎన్నో రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు లోతైన సంస్థాగత నెట్ వర్క్, ఆర్థిక వనరులు కలిగి ఉంటాయి. అవి కొత్త ఉద్యమాలను కష్టతరం చేస్తాయి. భారతదేశంలో ఎన్నికల రాజకీయాలకు విస్తృత స్థాయిలో అట్టడుగు స్థాయినుంచి సమీకరణ, సంస్థాగతంగా సంకీర్ణపరమైన నిర్మాణం అవసరం. ఇంకా కులం, మతం, భాష, ప్రాంతీయ గుర్తింపులతో కూడిన విస్తృతమైన సామాజిక వైవిధ్యం, తరచు రాజకీయ సమీకరణలను విచ్ఛిన్నం చేస్తుంది. యువత క్రియాశీలత జాతీయ దృష్టిని ఆకర్షించినా, ఆ శక్తి ఏకీకృత రాజకీయ ఉద్యమంగా మార్చడం సవాల్‌గా మిగిలిపోతుంది. అయినా, భారతదేశంలో జనరేషన్ – జెడ్ రాజకీయ తరంగాన్ని తక్కువగా అంచనా వేయలేం. యువ ఓటర్లు నిర్మాణాత్మక ఎన్నికల కూటమిగా మారుతున్నారు. రాజకీయ పార్టీలు, తమ అజెండాలు, నాయకత్వాలను నిర్మించడంలో యువ ఓటర్ల డిమాండ్లను ప్రతిబింబించేలా మార్చుకోవచ్చు. డిజిటల్ సమీకరణతో అట్టడుకు స్థాయి యువత ఆధారిత ఉద్యమం ఉద్భవిస్తే, భారతదేశ రాజకీయ దృశ్యం సమర్థవంతంగా పునర్మాణం కాదలదు.
ఈశాన్య భారతంలో అటువంటి మార్పునకు వీలు కల్పిస్తున్నది. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలోని మిగతా ప్రాంతాలతో సిలిగురి కారిడార్ ద్వారా అనుసంధానమై ఉన్నాయి. ఈ ప్రాంతానికి అటు నేపాల్, ఇటు బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ పొరుగు దేశాలలో రాజకీయ పరిణామాలు భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనవిగా మారాయి. నేపాల్ రాజకీయ కొత్త నాయకత్వంలో మార్పు, సరిహద్దు ఆర్థిక సహకారాన్ని ప్రభావితం చేయవచ్చు. యువ నాయకత్వంలో సంస్కరణలతో కూడిన ప్రభుత్వ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాణిజ్య విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వగలదు. ఈ విధానాలు నేపాల్, బంగ్లాదేశ్, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయగలవు. బంగ్లాదేశ్ రాజకీయ పథం అంతే కీలకమైనది. భారదేశ ప్రధాన భూ భాగాన్ని ఈశాన్య ప్రాంతాలతో కలిపే కనెక్టివిటీ ప్రాజెక్టులకు ఈ దేశం ప్రధాన రవాణా మార్గంగా పని చేస్తుంది. బంగ్లాదేశ్‌లో రాజకీయ స్థిరత్వం నెలకొంటే ఈ ప్రాంత ఆర్థిక భవిష్యత్‌ను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది. నేపాల్‌లో, దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలలో యువత నేతృత్వంలో రాజకీయ ఉద్యమాలు ఊపందుకుంటే, ఈ ప్రాంతం అంతటా రాజకీయ చర్చను ప్రభావితం చేయవచ్చు. నేపాల్, బంగ్లాదేశ్ నుంచి అందిన పాఠాలు భారతదేశానికి ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని యువజనాభా ప్రజాస్వామ్య రాజకీయ ఉద్యమాలను పునర్నిర్మించే సామర్థ్యం కలిగి ఉంది. ఆ సామర్థ్యాన్ని నిజమైన రాజకీయశక్తిగా మార్చే నాయకత్వం, సంస్థ, సంస్థాగత ఆవిష్కరణలు అవసరం.
– గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్)
– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు