Reading Time: 2 minutes

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం (7.3.2026) డార్జిలింగ్‌లో అంతర్జాతీయ సంతాల్ గిరిజన సదస్సులో పాల్గొన్నప్పుడు సరిగ్గా ప్రోటోకాల్ పాటించలేదనీ, అంతేకాదు చివరి నిమిషంలో వేదిక కూడా మార్చారనీ ఆరోపణలు వచ్చాయి. ఈ కార్యక్రమం విషయంలో రాష్ట్రప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదనీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సంఘటన ‘ఘోర అవమానం’గా రాజకీయ దుమారం రేపుతోంది. బిజెపి వర్గాలనుంచి విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఆరోజున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమగ్ర ఓటర్ల సవరణ లోపాలపైన, ఎల్‌పిజి గ్యాస్ ధర పెరగడంపైన ధర్నా నిర్వహిస్తున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు గవర్నర్ గానీ లేదా రాష్ట్రం లోని సీనియర్ మంత్రులు ఎవరైనా ప్రోటోకాల్ పాటించి విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలకాల్సి ఉంది. అయితే రాష్ట్ర గవర్నర్ ఆనంద్ రాజీనామా చేశారు. సిలుగురి మేయర్ గౌతమ్ దేవ్ మాత్రమే రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఇవన్నీ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గత 15 ఏళ్లుగా రాష్ట్రాన్ని నిరంతరాయంగా పరిపాలిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గద్దె నుంచి దించేయాలని కంకణం కట్టుకున్న బిజెపి అధినేతలకు ఈ వివాదం ప్రచారాస్త్రంగా చేతికి అందివచ్చినట్టయింది.

అందుకనే ప్రధాని మోడీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఇప్పటినుంచే శాపాలు పెట్టడం ప్రారంభించారు. గిరిజన సమాజం నుంచి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు జరిగిన అవమానం గిరిజన ప్రపంచానికే అవమానమని, అంతేకాక రాజ్యాంగానికి, స్ఫూర్తికి తీరని అవమానమని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ఎవరైతే అధికారంలో అహంకార మత్తులో ఉంటారో వారికి వినాశనం తప్పదని శాపం పెట్టారు. దీనికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టిగా స్పందించారు. గిరిజన నాయకురాలైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును గౌరవించని వ్యక్తి మీరు తప్ప తాము కాదని తిప్పికొట్టారు. అంతేకాదు బిజెపి కాకలు తీరిన వయోవృద్ధనేత ఎల్‌కె అద్వానీకి భారత రత్న బిరుదు ప్రదానం సందర్భంగా జ్ఞాపికను అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేసినప్పటి ఫోటోను టాగ్ చేసి చూపించారు. అందులో అద్వానీ, మోడీ కూర్చుండగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాత్రం నిల్చుని ఉండడం గమనార్హం. ఇది రాష్ట్రపతిని అవమానించడం కాదా? అని మమతా బెనర్జీ ప్రశ్నిస్తున్నారు. అసలు సంతాల్ గిరిజన సదస్సుకు సరైన ఏర్పాట్లు జరగలేదన్నది వాస్తవం. అధికారులు ముందుగానే సదస్సు ఏర్పాట్లు ఎంతవరకు నిర్వాహకులు చేస్తున్నారో పరిశీలించారు.

కానీ సదస్సు ఇంకా రెండు రోజుల్లో జరగవలసి ఉన్నా నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులకు వివరించారు. సన్నాహాలు వెంటనే ప్రారంభించాలని నిర్వాహకులను హెచ్చరించాలని సూచించారు. ఇది చివరకు రాష్ట్రపతి సెక్రటేరియట్, రాష్ట్రపతి భవన్ ప్రోటోకాల్, టూర్ ఆఫీసర్ దృష్టికి కూడా వెళ్లింది. కానీ వారదేమీ పట్టించుకోకుండా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ జారీ చేసిన ‘బ్లూబుక్స్’ నిబంధనల ప్రకారం ప్రోటోకాల్, భద్రత, ఏర్పాట్లు అన్నీ పక్కాగా నిర్వహించాల్సిన పూర్తి బాధ్యత పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెబుతున్నారు. అందువల్ల రాష్ట్రపతికి అవమానం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే అన్న ప్రచారాన్ని బిజెపి నాయకులు ముందుకు తీసుకెళ్లున్నారు. అయితే ఈ సంఘటనను బిజెపి నాయకుల సలహాపై రాజకీయ వివాదంగా మార్చవద్దని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ప్రోటోకాల్‌కు ఎక్కడా భంగం కాలేదని వివరించారు.

సంతాల్ సదస్సును నిర్వహిస్తున్న ప్రైవేట్ యాజమాన్య నిర్వాహకులు సరిగ్గా నిర్వహించలేకపోవడమే కారణమని పేర్కొన్నారు.ఇందులో ఎయిర్‌పోర్టు అథారిటీ బాధ్యత కూడా ఉందని వారే వేదిక మార్చారని వివరించారు. మరి మణిపూర్ గిరిజనులపై గత కొన్నేళ్లుగా అత్యాచారాలు జరుగుతుండడంపై రాష్ట్రపతి ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ అవమాన ఘట్టం ఎన్నికల ముందు తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని బిజెపి చూస్తోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అవమానం జరిగే సంఘటనలు గతం లో కూడా ప్రభుత్వప్రవర్తన వల్లనే జరిగాయి. 2023 మే 28న నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించకపోవడం, ప్రధాని నరేంద్ర మోడీయే ప్రారంభించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి.

రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరురాలు కాబట్టి ఆమె ప్రారంభించాలని కాంగ్రెస్ తదితర పక్షాలువాదించాయి. ద్రౌపదీ ముర్ము కాకుండా ప్రధాని మోడీ ప్రారంభించడంతో ఇది రాష్ట్రపతికి, గిరిజన సామాజిక వర్గానికి, రాజ్యాంగానికి అవమానంగా కాంగ్రెస్ ధ్వజమెత్తింది. అంతేకాదు ఈ చారిత్రక కార్యక్రమాన్ని కాంగ్రెస్‌తో సహా ఆప్, తృణమూల్, సమాజ్‌వాది తదితర 20 పార్టీలు బహిష్కరించాయి. అయితే అధికార పక్షం పాత పార్లమెంట్ భవన నిర్మాణ శంకుస్థాపన నాటి రాష్ట్రపతి చేతుల మీదుగా జరగలేదని వాదించింది. 2024 జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకాకపోవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆమె ఆదివాసీ వర్గానికి చెందిన మహిళ కావడం, వితంతు కావడం వల్లనే ఆహ్వానించలేదని కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ తదితరులు బాహాటంగా విమర్శించారు. అప్పుడు బిజెపి దీన్ని తమ తప్పు కాదని సమర్థించుకుంది. రామజన్మభూమి తీర్థక్షేత్ర ద్వారా ఆహ్వానాలు వెళ్లాయి తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదని వాదించాయి. ఇవన్నీ రాష్ట్రపతికి అవమానంగా అధికార వర్గం ఎందుకు పరిగణించడం లేదో చెప్పాల్సిందే.