Reading Time: 2 minutes

కొత్త వాటి పరిష్కారం పోలీసులకు సవాల్

సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే పౌరులకు మెరుగైన సేవలు

శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు

పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్‌లో సిఎం 

మనతెలంగాణ/హైదరాబాద్: ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొవలసి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్- 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత బాగా పనిచేసినా ఈ వ్యవస్థలో మొదటగా బద్‌నాం అయ్యేది పోలీసులే అని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసులు ముందుగా సమస్యలను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. సమస్య అర్థమైతే సగం సమస్యను పరిష్కారం లభించినట్లేనని ఆయన తెలిపారు. దేశంలోని ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారిందని, ట్రాఫిక్ సమస్యలతో బెంగుళూరు నగరంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముంబై, చెన్నై నగరాలు వరదలతో సతమతమవుతున్నాయని, అలాంటి మెట్రోపాలిటన్ నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక కోల్‌కత్తా గురించి చెప్పే అవసరమే లేదని, వాటితో పోలీస్తే మనం చాలా బెటర్ ప్లేస్‌లో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

ఛాలెంజ్‌లు రెండు రకాలు

ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని, మనం ఎక్కడున్నామో తెలుసుకోగలిగితే మనం ఎక్కడికి చేరుకోవాలో తెలుస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే ఈ రిట్రీట్ కార్యక్రమం ద్వారా సమస్యలు, పరిష్కారాల గురించి విశ్లేషించుకున్నామన్నారు. ఛాలెంజ్‌లు రెండు రకాలని, ఒకటి టెక్నికల్ ఛాలెంజ్, రెండోది అడాప్టివ్ ఛాలెంజ్ రిసోర్సెస్ అని ఆయన తెలిపారు. సమయాన్ని కేటాయిస్తే టెక్నికల్ ఛాలెంజ్ ను అధిగమించ వచ్చని, కానీ, అడాప్టివ్ ఛాలెంజ్ విషయంలో ఎదురైన సమస్య లోతును అర్థంచేసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండకూడదనే ‘తెలంగాణ రైజింగ్ 2047’ పాలసీ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించుకున్నామని ఆయన తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా పరిగణించుకుంటున్నామన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయింది

ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశా రు. సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన సిస్టంను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న అధికారులను నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్న సిబ్బంది, అధికారులను అప్‌గ్రేడ్ చేసుకోకపోతే నేరాలను నిరోధించలేమన్నారు.

పనితీరు ఆధారంగానే పోస్టింగ్‌లు

పోలీస్ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. పోలీస్ శాఖలో ఉద్యోగులు ఆటోమోడ్ కు వెళితే సమాజానికి అత్యంత ప్రమాదకరమన్నారు. పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవ్వాల్సిందేనని, అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని సిఎం రేవంత్ తెలిపారు. మీ పనితీరు ఆధారంగానే పోస్టింగ్‌లు ఉంటాయని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్- 2026 కార్యక్రమంలో భాగంగా విభాగాల వారీగా వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా పోలీస్ ఉన్నతాధికారులు సిఎంకు వివరించారు. భవిష్యత్ లో పోలీసింగ్ లో తీసుకురావాల్సిన మార్పులు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. సాంకేతిక పెరుగుతుండడంతో కొత్త తరహా నేరాలు పెరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని సిఎం సూచించారు.