
నాపై మొరిగే కుక్కలను ఏ గొలుసుతో కట్టేయాలో నాకు తెలుసు
ఖమ్మం జిల్లా వెలుగుపట్లలో నిజమైన లబ్ధిదారులు 410 మంది మాత్రమే
330 మంది బోగస్ లబ్ధిదారులే
నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం
అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కెసిఆర్‌తో సహా
బిఆర్‌ఎస్ శాసనసభ్యులందరూ హాజరుకావాలి
ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీకి హాజరై అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాం
విలేకరులతో చిట్‌చాట్‌లో రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగ్‌రోడ్డు) పక్కన రాజేంద్రనగర్‌లో ఉన్న క్రషర్‌తో, క్వారీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. తనపై మొరిగే కుక్కలను ఏ గొలుసుతో కట్టేయాలో తనకు తెలుసన్నారు. ఆ క్వారీ నాదని కొందరు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని, నాకు క్రషర్ నడిపే ఓపిక లేదని, అది నా క్రషర్ కాదని, బిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నానని ఆయన తెలిపారు.
తిరుమల క్రషర్‌కు వేస్ట్ క్రష్ చేసి సప్లై చేసే లైసెన్స్ ఉందని, ఆ క్రషర్ కంపెనీకి మా కంటైనర్‌ను తీసుకువెళ్లిందని దానిపై ఉన్న పేరును తొలగించినట్లు ఉన్నారని, దానిని ఆధారంగా కొందరు పిచ్చికూతలు కూస్తున్నారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుపట్లలో 410 మంది నిజమైన లబ్ధిదారులు ఉన్నారని అందులో 330మంది బోగస్ అని తేలిందని, నిజమైన 410 మంది లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని, తనపై పిచ్చి మాటలు మాట్లాడుతున్న వారికి అసెంబ్లీలో గట్టిగా సమాధానం చెబుతానని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికే ఖమ్మం జిల్లా వెలుగుపట్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ పేదవాడి పక్షానే ఉంటుందని మరోమారు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సోమవారం విలేకరులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన చాంబర్‌లో చిట్‌చాట్ చేశారు.
బిఆర్‌ఎస్ శాసనసభ్యులు సభకు వచ్చి తమ వాదనలు వినిపించాలి
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కెసిఆర్‌తో సహా బిఆర్‌ఎస్ శాసనసభ్యులందరూ హాజరుకావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ హాజరై అడిగే ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బిఆర్‌ఎస్ శాసనసభ్యులు సభకు వచ్చి తమ వాదనలు వినిపిస్తే, ప్రతి విషయానికి సాక్ష్యాధారాలతో సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ, ప్రతిపక్షం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వారి సొంత ఎజెండాతో సభకు వస్తున్నారన్నారు.