
ఇప్పటికే మూడుసార్లు రైతుబంధు ఎగవేత
పదవి కాపాడుకోవడానికి గాంధీ కుటుంబానికి ఏటా వెయ్యికోట్ల కప్పం
ఆరు కాంగ్రెస్ గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ బిల్లును అసెంబ్లీలో పెడతాం
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: కాంగ్రెస్ హ మీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలని ఈ నెల 16 నుండి ప్రారంభమయ్యే శాసన సభ సమావేశాల్లో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రతిపాదిస్తున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కెటిఆర్ అన్నారు. సోమవారం సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో వివిధ పార్టీల నాయకు లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు బిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కెటిఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కెటిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హమీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలన్నారు. కెసిఆర్ పాలనలో రైతులకు డిసెంబర్‌లో రైతుబంధు పడేదని, ఇప్పుడు మార్చి 9 వ తేదీ వచ్చిన మరో 15 రోజుల్లో పంటలు కోతకు వచ్చిన రైతు బంధు వేయలేదని, ఇప్పటికి మూడు సార్లు రైతు బంధు ఎగవేశారని, సిఎం రేవంత్ రెడ్డి రైతుబంధును ఎత్తే సి కొత్తగా రైతుబంధు బదులుగా రాహుల్ బంధు ప్రారంభించాడని కెటిఆర్ ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్‌రెడ్డితన పదవిని కాపాడుకోవడానికి ఏటా వెయ్యికోట్లు గాంధీ కుటుంబానికి కప్పం కడుతున్నాడని కెటిఆర్ ఆరోపించారు. రైతులకు బోనస్ లేదు, కాంగ్రెస్‌కు, రేవంత్‌కి సిగ్గు లేదని కెటిఆర్ విమర్శించారు.
ఇందిరమ్మ రాజ్యమంటే పేదల ఇండ్లు కూల్చడమా అని నిలదీశారు.ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో శత్రుదేశాలమీదకు యుద్ధానికి పోయినట్లు 3000 మంది పోలీసులతో వెళ్లి 1000 ఇండ్లు బుల్‌డోజర్లతో కూల్చేశారని, మహబూబ్ నగర్‌లో దివ్యాంగులు కట్టుకున్న150 నుండి 200 ఇండ్లు కూల్చేశారన్నారు. బఫర్‌జోన్‌లో కట్టిన ఇండ్లను కూలుస్తానని చెపుతున్న సిఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కొడంగల్ సమీపంలోని కోస్గిలో రెడ్డికుంటలో తన ఇంటిని పూర్తిగా చెరువులోనే కట్టాడని దాన్నెందుకు కూల్చరని నిలదీశారు. సిఎం అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో ఇల్లు కట్టాడని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డా. వివేక్, పట్నం మహేందర్ రెడ్డి చెరువులో ఇండ్లు కడితే వాటినెందుకు కూల్చడం లేదని అన్నారు. గరీబోళ్ల ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యామా అని ప్రశ్నించారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసగించి మరి కొద్ది రోజుల్లో వెయ్యి రోజులకు చేరుతున్నా ఇప్పటివరకు ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు.జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్దత కల్పిస్తామని హమీ ఇచ్చిమర్చిపోయాడన్నారు. బిఆర్‌ఎస్ మాత్రం ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ఈ నెల 16నుండి ప్రారంభమయేశాసనసభ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలని పోరాడుతామన్నారు.ఆడవారికి ఫ్రీ బస్ అని మగవాళ్ల దగ్గర డబుల్ టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. తాము ఫ్రీ బస్ విధానానికి వ్యతిరేకం కాదన్నారు. కళ్యాణలక్ష్మి పథకంక్రింద కెసిఆర్ లక్ష రూపాయలిస్తే కాంగ్రెస్ వారు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కరికైనా ఇచ్చారా అని నిలదీశారు. సిఎం ఆర్ధిక కష్టాలున్నాయంటున్నాడని మరి అలాంటప్పుడు లక్షన్నర కోట్లతో మూసి సుందరీకరణ ఎందుకని నిలదీశారు.
ప్రతి ఏటా లక్ష ఉద్యోగాలిస్తామన్న రాహుల్ గాంధీ పత్తాలేకుండా పో యాడన్నారు. ఇవన్నీ చూస్తూ ప్రజలు అన్నా కేసిఆర్ ఎక్కడున్నారు అని అంటున్నారని, మళ్లీ కేసిఆర్ సిఎం కావాలని అన్ని వర్గాల వారు కోరుకుంటున్నారన్నారు. ఫిబ్రవరి 9న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు కాగానే రూ.లు 9 వేల కోట్లు రైతు బంధు వేస్తానని హమీ ఇచ్చారని అవి ఎటు పోయాయన్నారు.బిసిలకు బడ్జెట్‌లో లక్ష కోట్లు అన్నారు. ఇప్పటి వరకు మూడు బడ్జెట్‌లో పో యాయి ఇంతవరకు దిక్కులేదన్నారు. మార్చి 16 నుండి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో బిసిలకు రూ.20వేల కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించాలన్నారు.
అంబేద్కర్ అభయ హస్తం క్రింద రూ.12 లక్షలు ఇస్తామని మోసగించారన్నా రు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు పెన్షన్లు పెంచాడని,తెలంగాణలో కూడా ప్రజలు పెన్షన్ల పెంపుకోసం ఎదిరి చూస్తున్నారన్నారు. యువతకు ఏటా రెండు లక్షలు ఉద్యోగాలని ఇప్పటి వరకు కనీసం పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు.జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందన్నారు.తెలంగాణలో దుర్మార్గ, అప్రజాస్వామ్య, రాబంధు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఊపిరి సల్పనివ్వకుండా బిఆర్‌ఎస్ చేయనున్న ఉద్యమాలకు ప్రజలందరూ కలిసి రావాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.