
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మనోహరమైన పాట ప్రధాన పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించింది. ప్రఖ్యాత గీత రచయిత గోరేటి వెంకన్న రచించిన ఈ పాట స్వచ్ఛమైన తెలుగు కవిత్వంతో పాటు హృదయాన్ని తాకే భావాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది. దేశీ మూలాలు, విదేశీ జీవితానికి మధ్య ఉన్న విరుద్ధ భావాలను సున్నితంగా ప్రతిబింబిస్తూ సినిమా కథనానికి అనుగుణంగా ఈ పాట సాగుతుంది.
ఈ గీతానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఆ కూర్పుకు మరింత గాఢతను జోడిస్తూ హేషమ్ అబ్దుల్ వహాబ్, గోరేటి వెంకన్న కలిసి శ్రావ్యంగా పాటను ఆలపించారు. దృశ్యపరంగా ఈ పాట లండన్ యొక్క అద్భుతమైన దృశ్యాలను ప్రదర్శిస్తుంది. బ్లాక్‌బస్టర్ బేబీ తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడి తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నైంటీస్ వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.