Reading Time: < 1 minute

 సైక్లింగ్‌, ఫిట్‌నెస్‌పై అవ‌గాహ‌న కోసం యాత్ర చేప‌ట్టిన సైక్లిస్ట్ కాంతి ద‌త్‌

 ఏడు రోజులు 800 కి.మి సైక్లింగ్‌.. 30 చోట్ల అవ‌గాహ‌న స‌ద‌స్సులు

హైదరాబాద్: ఫిట్‌నెస్, సైక్లింగ్‌పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ప్ర‌ముఖ సైక్లిస్ట్‌, వెల్‌నెస్ అడ్వకేట్ కాంతి దత్ హైద‌రాబాద్ నుంచి ముంబైకి సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు. మార్చి 7 నుంచి మార్చి 14 వరకు సుమారు 800 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై ప్రయాణిస్తూ 30 చోట్ల అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఫియర్ ప్రాజెక్ట్ పేరిట‌, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన ప్రారంభ‌ కార్యక్రమంలో పలువురు అతిథులు, ఫిట్‌నెస్ ప్రేమికులు మరియు ప్రముఖులు పాల్గొని కాంతి దత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంత‌రం అక్క‌డ నుంచే సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు.

మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఈ ప్రయాణంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ సుమారు 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సమావేశ‌మై ఫిట్‌నెస్ ప్రాముఖ్యత, సైక్లింగ్ ప్రయోజనాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించనున్నారు.

ఈ సందర్భంగా కాంతి దత్ మాట్లాడుతూ.. “మార్చి 7 నుండి మార్చి 14 వరకు హైదరాబాద్ నుండి ముంబై వరకు సైకిల్‌పై ప్రయాణం చేయబోతున్నాను. నోవాటెల్‌లో పలువురు అతిథుల సమక్షంలో ఈ యాత్రను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎనిమిది రోజుల ప్రయాణంలో పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ విద్యార్థులతో ఫిట్‌నెస్ మరియు సైక్లింగ్ గురించి చర్చలు జరపనున్నాను. సైక్లింగ్ వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మనసుకు ప్రశాంతత కూడా కలుగుతుంది. ఈ సందేశాన్ని ఎక్కువ మందికి చేరవేయడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం” అని తెలిపారు.

సైక్లింగ్‌ను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, యువతలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంపొందించాల‌నేది ఈ సైక్లింగ్ యాత్ర ల‌క్ష్య‌మ‌ని కాంతి దత్ తెలిపారు. అలాగే పర్యావరణానికి అనుకూలమైన రవాణా విధానంగా సైక్లింగ్‌ను ప్రోత్సహించడం కూడా ఈ యాత్ర ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా కాంతి చెప్పారు.

మ‌రిన్ని వివ‌రాల కోసం: 95504 57149 (శ్రీహిత సొల్యూష‌న్స్‌)