
మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా లేక ఒవైసీ పాలన నడుస్తున్నదా? అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తున్నదని ఆయన సోమవారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముందుగా మజ్లీస్ అధినేత, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అనుమతి తీసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పాలన ఒవైసీ చేతుల్లో ఉందని ఆయన విమర్శించారు. ప్రజల కోసం కాదు ఒవైసీ కోసం పాలన చేస్తున్నట్లు ఉందని ఆయన దుయ్యబట్టారు.
కేంద్ర మంత్రి బండి ధ్వజం
పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రజలకు భూమి ఇస్తామని చెప్పారని ఆయన తెలిపారు. ఫీజు రీ-యంబర్స్‌మెంట్ నిధులు, విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు కొనిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పైగా అసద్ పిలుపునిస్తే వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.