
మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీలేర్పడిన రెండు స్థానాలకూ కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం అసెంబ్లీ అదనపు కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి వారిరువురికీ నియామక (ధృవీకరణ) పత్రాలు అందజేశారు. సర్టిఫికేట్లు అందుకోవడానికి అభిషేక్ మను సంఘ్వి, వేం నరేందర్ రెడ్డి మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్నారు.
వారిరువురిని అభినందించడానికి పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులూ చేరుకున్నారు. వారంతా తొలుత అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన అనంతరం వేం, సింఘ్వి మంత్రులు, పార్టీ ఇతర నాయకులతో కలిసి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ఛాంబర్‌కు చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవమైన వేం నరేందర్ రెడ్డికి, అభిషేక్ మను సింఘ్వికి సర్టిఫికేట్లు అందజేశారు.
అభినందన మందార మాల..
సర్టిఫికేట్లు అందుకున్న వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించారు. మంత్రులు, పార్టీ ఇతర నాయకులూ వారిని అభినందించారు.