
మనతెలంగాణ/హైదరాబాద్ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మహారాష్ట్రలోని లాతూర్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం సందర్బంగా ఇచ్చిన ఉద్యోగ ప్యాకేజిని కాజీపేట్ భూ నిర్వాసితులకు అమలు చేయాలని మాజీ ఎంపి వినోద్ కుమార్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రతినిధి బృందం రైల్వే జిఎంను శ్రీనివాస్తవను కోరింది. ఈ మేరకు సోమవారం దక్షిణ మధ్య రైల్వే జి.ఎం. సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ సహా వరంగల్ జిల్లాకు చెందిన పలువురు బిఆర్‌ఎస్ నాయకులు సోమవారం సికింద్రాబాద్ కార్యాలయంలో భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా పలు అంశాలపై వినతి పత్రాన్ని జిఎం శ్రీవాస్తవకు అందజేశారు. కాజీపేట్‌లో ఏర్పాటు అయింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీయేనని జిఎం స్పష్టత ఇచ్చారని వినోద్ కుమార్ తెలిపారు. కాజీపేట్‌లో రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆ బృందం శ్రీవాస్తవను కోరింది. జిల్లాలో పలు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. దీంతో పాటు మరికొన్ని అంశాలను జిఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశాలపై రైల్వే జిఎం శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించారని బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. బిఆర్‌ఎస్ ప్రతినిది బృందంలో మాజీ ఎంఎల్‌ఎలు దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, తదితరులు ఉన్నారు.