Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మంది నిందితులకు ఢిల్లీ హైకోర్టు సోమ వారం నోటీసులు జారీ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు ఊరట కలిగిస్తూ ఇటీవల ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సిబిఐ పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా వాదన లు వినిపించారు. సిబిఐ దాఖలు చేసిన ఈ రివిజన్ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

విచారణ సందర్భంగా సిబిఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ విచారణాధికారిపై కోర్టు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు దర్యాప్తు సంస్థ, విచారణాధికారిపై ట్రయల్ కోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, సిబిఐ కేసులో నిందితులు విడుదలయ్యారు కాబట్టి ఇడి దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసు విచారణను కూడా నిలిపివేయాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరగా హైకోర్టు భిన్నంగా స్పందించింది. సిబిఐ రివిజన్ పిటిషన్‌పై నిర్ణ యం తీసుకునే వరకు మనీ లాండరింగ్ కేసు విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది.

ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు లిక్కర్ స్కాం కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఇడి దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లలోని కొన్ని అంశాలపై స్పష్టత లేదని, సాక్ష్యాధారాల సేకరణలో జాప్యం జరుగుతోందని కోర్టు అభిప్రాయపడింది. కొందరు నిందితులు తమపై ఉన్న కేసులను కొట్టివేయాలని (డిశ్చా ర్జ్) కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టు సానుకూలంగా స్పందించింది. కేవలం ఆరోపణలతో కేసు దర్యాప్తు జరిగిందని, తగి నన్ని ప్రాథమిక ఆధారాలు లేకుండా నిందితులను ఎక్కువ కాలం జైల్లో ఉంచడం లేదా విచారణను సాగదీయడం సరికాదని కోర్టు పేర్కొంది.

ఈ క్రమంలోనే 23 మంది నిందితులపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ వారి లిక్కర్ పాలసీ కేసు నుంచి విముక్తి కల్పించింది. సిబిఐ ప్రస్తు తం ఈ అంశాలన్నింటినీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఆప్ ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ పాలసీ స్కామ్‌లో భారీగా ముడుపులు చేతులు మారాయని, దీని వెనుక ఉన్న ’సౌత్ గ్రూప్’, ఇతర రాజకీయ నేతల ప్రమేయాన్ని నిరూపించడానికి మరింత లోతుగా దర్యాప్తు జరగా లని సిబిఐ వాదిస్తోంది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 16కు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.