Reading Time: < 1 minute

ఐసిసి టి-20 ప్రపంచకప్-2026 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం కివీస్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ తదుపరి షెడ్యూల్ ఏంటని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభంకానుంది. మార్చి 28 నుంచి మే 31 వరకూ ఈ లీగ్ జరుగనుంది. ఆ తర్వాత భారత్ షెడ్యూల్ మొదలవుతుంది.

జూన్ నెలలో అఫ్ఘనిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఇందులో ఓ టెస్ట్, వన్డే సిరీస్ జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ న్యూ చంఢీఘడ్‌లో జరుగుతుంది. అనంతరం వన్డేలు జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగుతాయి. ఆ తర్వాత భారత్ జూలై నెలలో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టి-20లు, 3 వన్డులు జరుగనున్నాయి. టి-20లు జూలై 1, 4, 7, 9, 11 తేదీల్లో చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్‌హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా జరుగుతాయి. వన్డేలు ఎడ్జ్‌బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా.. జూలై 14, 16, 19 తేదీల్లో జరుగుతాయి.

అనంతరం భారత జట్టు ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో 2 టెస్టులు, 2 టి-20ల సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. దీని తర్వాత సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఏషియన్ గేమ్స్ జరుగుతాయి. ఆ తర్వాత భారత జట్టు స్వదేశంలో అఫ్ఘనిస్తాన్‌తో 3 టి-20లు, 3 వన్డేల సిరీస్‌లు ఆడుతుంది. అనంతరం స్వదేశంలోనే వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టి-20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టి-20లు జరుగనున్నాయి. ఈ ఏడాది చివర్లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టి-20లు జరుగుతాయి.