Reading Time: < 1 minute

హైదరాబాద్: ఆలోచించి ఓటెయ్యాలని, మోసపోతే గోసపడ్తం అని ఆనాడే మాజీ సిఎం కెసిఆర్ ప్రజలకు చెప్పారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కెటిఆర్ పర్యటించారు. కెటిఆర్ సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పైసాపైసా కూడబెట్టుకుని పేదలు ఇల్లు కట్టుకుంటుంటే.. రేవంత్ సర్కార్ మహబూబ్ నగర్ లో దివ్యాంగుల ఇండ్లను సైతం కూలగొట్టిందని, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 1000 ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టిందని విమర్శించారు. బఫర్ జోన్ లో ఉండొద్దని సిఎం రేవంత్ రెడ్డి కొత్త సుద్దులు చెబుతున్నాడని, కొడంగల్ నియోజకవర్గం కోస్గిలోని రెడ్డికుంట రేవంత్ సొంత ఇల్లు చెరువులో ఉందని ఎద్దేవా చేశారు. బఫర్ జోన్లు, శిఖం భూములు పేదలకే..పెద్దొళ్లకు ఉండవా? అని..ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టుడేనా?అని కెటిఆర్ ప్రశ్నించారు.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలని చెప్పి వెయ్యి రోజులైనా అమలు చేయలేదని, ఉచిత బస్సు తప్ప ఒక్క పథకమైనా పెట్టిండ్రా? అని..ప్రశ్నించారు.  కెసిఆర్ రూ.10 లక్షలతో దళిత బంధు ఇచ్చారని తెలియజేశారు. రూ. 12 లక్షలు ఎప్పుడు ఇస్తారని దళితులు ఎదురు చూస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే రూ.12 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని కెటిఆర్ పేర్కొన్నారు. రూ. 2500 ఎప్పుడు ఇస్తారని మహిళలు, రూ. 4వేల పింఛన్ కోసం 40 లక్షల మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం రూ. 1000 కోట్ల బంధు పెట్టారని, అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులకు హామీ ఇచ్చారని, నిరుద్యోగులకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని అన్నారు. ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, ఇప్పటి వరకు చట్టబద్దత చేయలేదని, ఆరుగ్యారెంటీలకు చట్టబద్దత కల్పించేలా ఒత్తిడి తెస్తామని డిమాండ్ చేశారు. 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో ప్రైవేట్ మెంబరు బిల్లు పెడతామని, ప్రైవేట్ మెంబరు బిల్లు పాసయ్యేలా కృషి చేస్తామని అన్నారు. ప్రతీ ఒక్కరూ బిఆర్ఎస్ తో కలిసి రావాలని, మనమందరం కలిసి ప్రభుత్వం మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. మళ్లీ కెసిఆర్ రావాలని రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి అర్థమైందని కెటిఆర్ స్పష్టం చేశారు.