Reading Time: < 1 minute

శిరమెత్తిన శిశిరాలు గిరులెత్తిన గ్రీష్మాలే గానీ

వాలిసోలే వసంత గాలులు సోకని వంచిత వాడలు దాటిన

బిడ్డా జర పైలమ్

అడుగడుగునా,ఆరుకాలాలు అంటరానితనాలతో

నిన్ను ఊరి కావల నిలబెట్టిన గెట్లు దాటి కంటకాల కడలి దాటి వేయి పడగల రేవులు దాటిన, జర పైలం

వూరి ఉచ్చులను దాటి అగ్రహారాల హద్దురేఖలు దాటి

మొద్దు గీతల నదులను దాటిన

బిడ్డా జర పైలమ్

మీ తాతలు తండ్రులు తల్లులు అవ్వలు అక్కల సేతుల సెమట తగిలి బీల్లు నీళ్లు బోసుకున్నయి

భూమి కాడ, జాగకాడ, బువ్వ కాడ నిలదీసిన

నిరసనలు నెరివడ్డ నేలలు దాటిగా సోల్తీ తొవ్వల తొర్రల, పైలం బిడ్డా పైలం

నడిజామున చెత్త మొఖం బజార్లను

కొత్త మొకాలు చేసే

సేతుల సీపిరి కట్టలు

సంకల సఫాయితట్టలు

పిడికెత్తిన సేతులు, పియ్యేత్తిన మోతల కడుపుల నదులు, కాళ్ళ కిందసముద్రాలు

మోరుదోపు మొగ కుక్కల గుంపులతో

ప్రాణాలు మానాలు

పైలం బిడ్డా జర పైలం

సూర్పనఖల ముక్కు చెవులు చెక్కిన

ముక్కు మొకం లేని మొగ దేశం,

కులదేశం మాతంగి ఆరoజోతి బిడ్డలను జోగమ్మలను

బోగమ్మల చేసిన సనాతన విషధర్మాలతో

పైలం బిడ్డా పైలం

అంటరాని ఆడోల్లoటేనే

అగ్గువ సగ్గువ

కొట్టొచ్చు తిట్టొచ్చు

చెరచొచ్చు చంపొచ్చు దాదు ఫిరాదుల్లేనీ కర్మభూమి

పైలం బిడ్డా పైలం

తెగ్గోసిన నాలుక మీద నాలుగు అక్షరాల నడుమున గట్టి

సీసం నింపిన సెవులకు చదువుల పొది సుట్టి

సూపుడేలు దీప రూపాల దిక్కులకు

డిగ్రీ పట్టా ధీమాలతో ప్రశ్నల కొడవండ్ల

పటమేసి పుటం పెట్టి

ఆధునికంలో అడుగేసే

బిడ్డా జర పైలమ్

– జూపాక