
ఔను!ఆధారాలుండవు నిజమే
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా
పట్టపగలు నట్టనడివీధిలో అందరూ తిరుగుతున్న వేళ
కర్మసాక్షి సహస్రకిరణభానుణ్ణే
మూటగట్టి మూడో కంటికి తెలియకుండా చీకటిగోతాంలో కుక్కి
అన్యాయం నదిలో విసిరి పారేస్తారు
నల్లమేకను కుక్క అని నమ్మించగలరు
తొర్రలోనుంచి అబద్ధ సాక్ష్యం చెప్పించగలరు
న్యాయదేవత గుడ్డిది కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధారి
ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన
ప్రజాస్వామ్య దేశంలో లేనిది
ప్రజాభాగస్వామ్యమే మేరామహాన్ భారత్‌లో
కాలరెత్తుకొని నడివీధిలో దోషులు
ఊచల వెనుక జైలు పక్షులు నిర్దోషులు
జాతీయగీతం ‘జనగణమన’లో నేనున్నానా… అని ధర్మ సందేహం
చదువుకునే హక్కు జీవించే హక్కు అందరికీ సమానం సూక్తులు పుస్తకాలకే పరిమితం
ద్వంద్వ న్యాయవ్యవస్థలో అసమసమాజంలో ఆడపిల్లగా జన్మించడమే నేరం
మూడేళ్ళ పసిమొగ్గైనా ముడుతల దేహం ముదివగ్గైనా
కాముకుని నేత్రాలకు కనులవిందే
ఆడపిల్ల శరీరమే ఐఎస్‌ఐ మార్కు
అంగడి సరుకు
డాక్టరై బీదలకు సేవ చేయాలనికన్న కలలన్నీ
కాలిన కాగితం పేలికలు
వసతి గృహమే భక్షణ గృహం
మూతి కంటిన నెత్తురును తుడుచుకొంటూ
నిష్క్రమిస్తుంది కౄరజంతువు
శవానికి నోరుండదు
హంతకుని పేరు చెప్పటానికి
శవాల్లాంటి మనుషులకు
ధైర్యం ఉండదు
నిజంచెప్పడానికి
ధనవంతులకే కొమ్ము కాసే వ్యవస్థలో
నిర్భయ జాబితాలో
మరో పేరు చేరుతుంది అంతే
మనుషులు రోబోలుగా మారిపోయిన
ఏఐ యుగంలో
ఎవరి ఉద్యోగాల కోసం, ఎవరి ధనార్జన కోసం పరుగుపందాలు ప్రారంభం
ప్రపంచం ముందుకు సాగిపోతూనే ఉంటుంది ఏమీ ఎరగనట్లు
– మందరపు హైమవతి