
సముద్రాన్ని ఎక్కడ చూసినా
ఎప్పుడు చూసినా ఆశ్చర్యమే
ఆకాశపు నీలాన్ని అద్దుకొందేమో
దోసిళ్ళ నిండా నురుగులు నింపుకొని
ముఖంమీద జల్లుకొని చిలకరించినట్లు
అలల నవ్వుల్ని పెదాల మీద పులుముకుని
నీటితుప్పర్లతో సూర్యతాపాన్ని
తానే తగ్గిస్తున్నానని
అంతెత్తు అహంతో ఎగసిపడే
సముద్రాన్ని చూస్తుంటే
కెరటాల చేతుల్తో ఆకాశాన్ని అందుకుందా
ఆకాశం సముద్రాన్ని ఆలింగనం చేసుకుందా
అని అంతే ఆశ్చర్యం !
సముద్రాన్ని ఎక్కడ చూసినా
ఎప్పుడు చూసినా అదే సంబరం
తల్లిని చూసి చేతులుచాచి
గలగల నురుగులనవ్వులతో
పరుగులతో వచ్చే అలల పాపాయి
ఎగురుకుంటూ ఉవ్వెత్తున దూకుతుంటే
అనురాగ చిరుజల్లుతుంపరలతో
ఒళ్ళంతా పులకరించే సరికి
సముద్రాన్ని ఎప్పుడు చూసినా
అంతే సంబరం !!
సముద్రాన్ని ఎక్కడ చూసినా
ఎప్పుడు చూసినా అంతే భయం
గుండెలలో గిలిగింతలు పెట్టే
చిరు ఆనందాల్లా అటూ ఇటూ హడావుడిగా
సముద్రమంతా తమదే అన్నట్లు
ఈదుతోన్న చిరు చేపల్ని
అదును చూసి అఖాతపు నోటితో
మింగే భయంకర తిమింగలం గుర్తొస్తే
రంగు కలల వలలో చిక్కి దిక్కుతోచక
చల్లని సముద్ర గర్భాన్ని ఆశ్రయించిన
ఏ అమాయకపు ఆడపిల్లలవో
ఛిద్రమైన ఆశల చీలికలు
కాళ్ళకి చుట్టుకుని జారుతాయేమోనని
సముద్రాన్ని ఎప్పుడు చూసినా
అంతే భయం !!!
-శీలా సుభద్రాదేవి