Reading Time: < 1 minute
Iqoo Z11 India Launch Teased Expected Specifications

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) భారత మార్కెట్లో తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల ఐకూ Z11 లైట్‌ను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు భారత వినియోగదారుల ముందుకు iQOO Z11 మోడల్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఐకూ ఇండియా సీఈఓ నిపుణ్‌ మార్యా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా పరోక్షంగా సూచించారు. ఆయన చేసిన ఒక ఆసక్తికర పోస్ట్‌లోని లైన్ల మొదటి అక్షరాలను కలిపితే “Z11” అని వస్తుండటంతో ఈ ఫోన్ విడుదల త్వరలోనే ఉండబోతోందని స్పష్టమవుతోంది.

లీకైన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫోన్ గీక్‌బెంచ్ (Geekbench AI) బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై I2514 మోడల్ నంబర్‌తో కనిపించింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుందని, 12GB ర్యామ్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ ‘డైమెన్సిటీ 7500 టర్బో’ ప్రాసెసర్‌తో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. చైనా, మలేషియా వర్షన్‌లలో వేర్వేరు ప్రాసెసర్లను అందించిన కంపెనీ, భారత వర్షన్ కోసం ఈ ప్రత్యేక చిప్‌సెట్‌ను ఉపయోగించనుంది. అంతేకాకుండా, దీని ముందు భాగంలో కర్వ్‌డ్-ఎడ్జ్ AMOLED డిస్‌ప్లేతో పాటు శక్తివంతమైన భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. దీనిలో 9020 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సంవత్సరం భారత్‌లో లాంచ్ కాబోతున్న చివరి ఐకూ స్మార్ట్‌ఫోన్ ఇదే కావచ్చు. ఐకూ 16 మోడల్ చైనాలో ఈ ఏడాది చివర్లో విడుదలైనప్పటికీ, మెమరీ ధరలు పెరగడం వల్ల భారత మార్కెట్లోకి రావడం ఆలస్యం కావచ్చు. ధర ఇంకా అధికారికంగా వెల్లడికానప్పటికీ, త్వరలోనే ఈ మోడల్ లాంచ్ తేదీ మరియు పూర్తి ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.