
తరాజు
పితృసామ్యం నిన్ను అధిపతిగా మలచి నువ్వు
తరతరాల తక్కెడ తరాజులో
నన్నెప్పుడో తాలుగింజలా తేల్చేసావు
రెండు క్రోమోజోముల కలయిక నువ్వు నేను-
ఒక్క క్రోమోజము తేడాతో
నిర్మితమైన దేహాలు -నీది నాది
అంతమాత్రాన, నువ్వు ధీరుడు సూరుడు కాదు
నేను బేలనో అబలనో కాదు
నాకు బానిస ముద్ర వేసి ఉగ్గుపాలతోనే
భావ గరళం పోసారు
కానీ ఇప్పుడు ఆ బానిసత్వానికి
కాలం తీరిపోయింది
ఇప్పుడు నేనంటే,ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం
ఇప్పుడు నేనంటే,ఆకాంక్ష అభివృద్ధి
ఇప్పుడిక సృష్టిలో సగం
సగం సగం కలిస్తేనే పూర్ణం
ఇప్పుడిక,సమానత్వపు తరాజులో
నువ్వు నేను కుడి ఎడమ కాదు
తేడానే లేని మనుషులం
– రోహిణి వంజారి