
నేనిప్పుడు అనుద్యమకారిణిని
అస్తమిస్తున్న ఆలోచనల పరంపరలోనుంచి
తారుమారు అవుతున్న దిక్కులకు ఎగబాకుతున్న అనర్థ ఆవేశాన్ని
ఏదీ నాది కాదు
ఏదీ నా చేతిలో లేదు
శూలాలు బళ్ళాలు
పాడుబడిన నోటిలో సేద తీరుతున్నాయి
తపన తనకలాట
ఆరిపోయిన కొవ్వొత్తి మూలాల్లో నిలిచి వెలుగుకై దేవులాడుతున్నాయి
మౌనం…
మౌనం……
మౌనం……..
జపించాల్సిన మంత్రమై
చెవుల్లో రింగులు చుడుతోంది
ఆవిరి పట్టిన మనసు
ఎగిరిపోయేందుకు చిన్నగా
సిద్ధపడుతోంది
సాధారణాలన్నీ
అసంబద్ధానికి ఎగిరిపోయాక
వెలుగు తెరలు తెరలుగా విడిపోయాక
చీకటి నిత్యమై నిలుస్తోంది
మాటల చూపులవైపుకు శబ్దాలు
ప్రవహించడం ఆగిపోయాక
నిశ్శబ్దం దినదినప్రవర్ధమానమై
లోకాన్ని ఏలుతోంది
ఇప్పుడు
మనుషులు ఆడే ఆటలన్నీ
ఓటమిని గెలిపిస్తున్నాయి
– సుధా మురళి