Reading Time: 2 minutes

రాష్ట్రపతికి ఆహ్వానం పలకని సిఎం, అధికార యంత్రాంగం

ప్రొటోకాల్ ఉల్లంఘించిన పశ్చిమ బెంగాల్ సర్కార్

మండిపడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అన్ని హద్దులు దాటారని మమతపై మోడీ ఫైర్

ఎన్నికల్లో లబ్ధికి రాష్ట్రపతినీ ఉపయోగించుకుంటున్నారని మమత కౌంటర్

కోల్‌కతా/సిలిగురి/న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ప్రొటోకాల్ ఉల్లంఘనలకు దారితీయడంతో పాటు రాజకీయ రంగు పులుముకుంది. శనివారంనాడు సంతాల్ గిరిజిన తెగకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొనాల్సి ఉంది. అందుకు బిదన్‌నగర్‌లో తొలుత ఏర్పాట్లు కూడా చేశారు. భద్రతా పరమైన కారణాలు చూపుతూ హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ వేదికను బడోగ్రా విమానాశ్రయానికి దగ్గరల్లోని గోషైపూర్‌కు మార్చింది.

రాష్ట్రపతి పర్యటనకు వస్తున్నారనంటే ప్రొటోకాల్ ప్రకారం ఆ రాష్ట్రముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, కీలక అధికారులు ఆహ్వానం పలకాల్సి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. మంత్రులు కూడా ఎవరూ రాష్ట్రపతిని ఆహ్వానించలేదు. అధికారులు కూడా ప్రొటోకాల్‌ను పాటించలేదు. ఒక్క సిలిగురి మేయర్ గౌతమ్ దేవ్ మాత్రమే రాష్ట్రపతి ముర్మును విమానాశ్రయానికి వెళ్లి అహ్వానించారు. ఇది రాష్ట్రపతి ముర్ముకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సిఎం మమతను సోదరిగా సంబోధిస్తూనే సుతిమెత్తగా చురకలంటించారు.

సంతాల్ తెగ సభలో మాట్లాడుతూ.. ‘సాధారణంగా రాష్ట్రపతి వస్తే సిఎం, మంత్రులు, అధికారులు ఆహ్వానం పలుకుతారు. కానీ ఇక్కడ అవేమీ లేవు. గవర్నర్ కూడా రాజీనామా చేశారు. కొత్త వాళ్లు బాధ్యతలు తీసుకోలేదు. కానీ కార్యక్రమం తేదీ ఫిక్స్ అయ్యింది కాబట్టి నేను రాక తప్పలేదు. కనీసం మీరైనా వచ్చారు’ అని సభికులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీదన్‌నగర్‌లోనే సభ ఉన్నట్లయితే ఇంకా అధిక జనం హాజరయ్యే వారని, హఠాత్తుగా గోషైపూర్‌కు మార్చడం వల్ల రవాణా ఇబ్బందిగా మారి అనుకున్నంత మంది రాలేకపోయరాని, గిరిజనుల సంక్షేమం, పురోభివృద్ధి పట్ల రాష్ట్రానికి ఉన్న చిత్తుశుద్ధి ఇదేనా? అని ముర్ము మండిపడ్డారు. మమతా బెనర్జీ తనకు సోదరిలాంటి వారని, తాను కూడా బెంగాల్‌కు బిడ్డలాంటిదాన్ని అని అన్నారు. కానీ తాను ఇక్కడికి వచ్చేందుకు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆమె ఎందుకు ఆందోళన చెంది సభా వేదికను ఇక్కడికి మార్చరో తెలియదని రాష్ట్రపతి విసుర్లు విసిరారు.

టిఎంసికి ఇది సిగ్గుచేటు: ప్రధాని

రాష్ట్రపతికి జరిగిన ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఇది చాలా సిగ్గుచేటు అన్నారు. టిఎంసి ప్రభుత్వం అన్ని రకాల హద్దులు దాటేసిందని మోడీ మండిపడ్డారు. రాష్ట్రపతి కార్యాలయం రాజకీయాలకు అతీతం అని, రాజ్యాంగబద్ధ పదవి.. ఆ ఆఫీసును పవిత్రతను అందరం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగిన విధంగా నేర్చుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. స్వయంగా గిరిజన సంతతికి చెందిన రాష్ట్రపతి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై స్పందించిన తీరు తనను కలిచివేసిందన్నారు. గిరిజనుల సాధికారత పట్ల ఆ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఇదేనా అని మోడీ ప్రశ్నించారు.

రాష్ట్రపతిపై కేంద్రం ఒత్తిడి.. రాలేనని ముందే సమాచారం ఇచ్చాం: మమత

గిరిజనుల పేరిట తన ప్రభుత్వాన్ని రాష్ట్రపతి లక్షంగా చేసుకోవడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో రాష్ట్రపతి రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఆమె వ్యవహార శైలి ఉన్నట్లు తమకు అర్థం అవుతోందన్నారు. తాము గిరిజనుల అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాల్లో చేపడుతున్నామో తెలుసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో లబ్ధి కోసం బిజెపి రాష్ట్రపతి పదవిని ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ల దిగుజారుడు తనమేనని మమత అన్నారు.

తమకు ముందుస్తు కార్యక్రమాలు ఉన్నందున తనతో పాటు మంత్రులు, అధికార యంత్రాంగం హాజరుకాబోవడం లేదని రాష్ట్రపతికి ముందే సమాచారం ఇచ్చామని, అయినప్పటికీ దీన్ని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘మీరు ఏడాదికి ఒకటో రెండు సార్లు వస్తే స్వయంగా ఆహ్వానించగలం. కానీ మీరు కీలకమైన ఎన్నికల సమయంలో వచ్చారు. ప్రజల హక్కుల కోసం పోరాడే క్రమంలో తనకు ముందస్తు బిజీ షెడ్యూల్ ఉన్నందున రాలేకపోయాను’ అని రాష్ట్రపతిని ఉద్దేశించి మమత వ్యాఖ్యానించారు.