Reading Time: < 1 minute

హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తూ గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.60లు, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.115లు పెంచడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజలపై వేస్తున్న ఈ భారానికి నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, ఇప్పుడు గ్యాస్ ధర పెంచడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.

దేశ సంపదను అంబాని, అదాని వంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ, పేదప్రజలపై అదనపు భారాలు విధించే కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలు ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు. తక్షణమే పెంచిన వంట గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరల అదుపుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.