Reading Time: < 1 minute

టి-20 ప్రపంచకప్-2026 తుది దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే సాధారణంగా అహ్మదాబాద్ పిచ్ బౌలింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. కానీ, ఈ సారి భారీ స్కోర్ నమోదు అయ్యే అవకాశం ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అంచనా వేశాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రా‌తోనే కాకుండా మిగితా ఆటగాళ్లతో కూడా తమకు ప్రమాదం పొంచి ఉందని తెలిపాడు. భారత్‌తో ఫైనల్ పోరు నేపథ్యంలో శాంట్నర్ మీడియాతో మాట్లాడాడు.

‘‘ఇప్పటి వరకూ నేను అహ్మదాబాద్ పిచ్ చూడలేదు. ప్రస్తుతానికి కవర్స్ కప్పి ఉంది. అయితే, ఈసారి భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని మాత్రం అంచనా వేస్తున్నాం. పిచ్ ఫ్లాట్‌గా ఉంటుందని భావిస్తున్నా’’ అని శాంట్నర్ అన్నాడు.

బుమ్రాతో ప్రమాదం పొంచి ఉందనేది ప్రతీ ఒక్కరూ చెప్పే మాటే అన్న శాంట్నర్ ప్రపంచకప్‌లో బుమ్రా ప్రదర్శన కూడా అలాగే ఉందని కొనియాడారు. ‘‘ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా బుమ్రాను ఎదురుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఆ మ్యాచ్‌లో అతడే గేమ్ ఛేంజర్. తప్పకుండా సవాల్ తప్పదని భావిస్తున్నాం. కానీ, కేవలం బుమ్రాతోనే కాదు.. భారత జట్టులోని ప్రతీ ఒక్క ప్లేయర్‌తోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాటింగ్ లేదా బౌలింగ్‌ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూ.. వాళ్లు ఈ దశకు వచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేయర్ ముందుకు వచ్చి జట్టును విజయ పథంలోకి తీసుకెళ్లారు’’ అని పేర్కొన్నాడు.