Reading Time: < 1 minute

రాష్ట్రంలో ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులతో రాష్ట్ర కమిటీ అంతర్ధానం అయిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి చెందిన 11 మందిలో ప్రస్తుతం నలుగురు లొంగిపోయారని.. మిగిలింది ఏడుగురు మాత్రమే అని డిజిపి చెప్పారు. లొంగిపోయిన 130 మంది మావోయిస్టుల్లో 125 మంది చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, ఒకరు ఆంధ్రాప్రదేశ్, నలుగురు తెలంగాణకు చెందిన మావోయిస్టులని డిజిపి వెల్లడించారు. వీరందరికి మొత్తం రూ. 4.18 కోట్ల రూపాయల రివార్డు అందచేయనున్నామన్నారు.

లొంగిపోయిన మావోయిస్టుల్లో పిఎల్‌జిఏ బిఎటాలియన్ కాపీ1, 2 కమాండర్లు ఎండ్రి కలిత్రామ్ అలియాస్ ఉయికే కల్లు, కోర్సా లక్కు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ రీజినల్ పొలిటికల్ స్కూల్ సభ్యురాలు చలసాని నవత అలియాస్ చంద్ర, దేవ్‌జీ ప్రొటెక్షన్ టీమ్ కమాండర్ ఇర్పా రాము అలియాస్ వినోద్, డివిసి సభ్యుడు ముచాకి ఉంగల్ అలియాస్ సుధాకర్, చర్ల శబరి ఏరియా కమిటీ సభ్యురాలు పొట్టం అరుణ అలియాస్ సనికి లతో పాటు సిసిఎంల వ్యక్తిగత సిబ్బంది ఉన్నారన్నారు డిజిపి వివరించారు.

మావోయిస్టులు ఒక ఇన్సాన్ రైఫిల్, ఏకె 47 ఆయుధాలు 31, ఇన్సాస్ రైఫిళ్లు 21, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు 20, 303 రైఫిళ్లు 18, ఒక 9ఎంఎం కార్బన్ గన్, ఒక 7.62 బోల్ట్ యాక్షన్ రైఫిల్, ఒక ఫాల్ రైఫిల్, రెండు బిజిఎల్, ఒక స్టెన్ కార్బైన్, నాలుగు ఎయిర్ గన్స్ ఉన్నాయని, వీటితో పాటు 222 మ్యాగ్జైన్స్, 5,205 తూటాలు మావోయిస్టులు అప్పగించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయుధాలతో లొంగిపోయిన వారికి రివార్డు బహుమతి కూడా అందచేస్తామని డిజిపి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐబి ఐజి సుమతి, ఇంటెలిజెన్స్ ఏడిజిపి విజయ్ కుమార్, గ్రేహౌండ్స్ ఏడిజిపి అనిల్ తదితరులు పాల్గొన్నారు.