Reading Time: < 1 minute

ముంబై: టి-20 ప్రపంచకప్ 2026 ఫైనల్స్‌కి టీం ఇండియా చేరుకుంది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఇరు జట్లు ఎక్కడా తగ్గకుండా రన్స్ చేశారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి విజయం భారత్‌‌నే వరించింది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఆయన సతీమణి సాక్షి ధోనీ కూడా ఉన్నారు. విఐపి గ్యాలరీలో కూర్చొని వీరు మ్యాచ్‌ని వీక్షించారు.

అయితే ధోనీ, సాక్షిల మధ్య జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ శామ్ కర్రన్ ఓ బంతిని డిఫెన్స్ చేశాడు. అది పిచ్ అయ్యి గాల్లోకి లేవగా.. బుమ్రా ఫాలో త్రూలో అందుకున్నాడు. ఇది క్యాచ్ అని పొరబడిన సాక్షి సింగ్.. ఎగిరి గంతేసింది. వెనకే ఉన్న ధోనీ.. ‘‘అది క్యాచ్ కాదు.. నువ్వు కూర్చో’’ అని తన భార్యని మందలించాడు. దీంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో సూర్యకుమార్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.