
మన తెలంగాణ/ హైదరాబాద్: గత దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గ్రామ పంచాయ తీలు, స్థానిక సం స్థలకు రూ.11 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2015-16 నుంచి 201920 వరకు రూ. 5,060 కోట్లు వి డుదల చేయగా, 2020-21 నుండి 2025-26 వరకు కేటాయింపులు 80 శాతం పెరిగి రూ.9,050 కోట్లకు చేరుకున్నాయి. దీనిలో రూ.6,051 కోట్ల నిధులు 2026 జనవరికి ముందే విడుదలయ్యాయని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజాస్వా మ్య సంస్థలను బలోపేతం చేయ డం వల్ల జవాబుదారీతనం, పారదర్శకత మెరుగుపడుతుందని మోడీ ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తుందన్న కిషన్‌రెడ్డి దీనికి అనుగుణంగా స్థానిక సంస్థల అభివృద్ధికి నిధులు సకాలంలో విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులపై మంత్రి కిషన్ రెడ్డి గురువారం సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.
గ్రామీణ స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయింపుల కింద 2026లో రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.1,034.42 కోట్ల నిధులు అందాయని వివరించారు. ఈ నిధులతో రాష్ట్రంలోని 12,702 గ్రామ పంచాయతీలకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 5న గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా రూ.259.36 కోట్లు, ఆ తర్వాత రెండవ విడతగా రూ.387.1 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. 2025 నుంచి -26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులలో మూడవ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిందని, దీని ద్వారా తెలంగాణకు రూ.387.96 కోట్ల నిధులు అందాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇటీవలే ఈ నిధులను కేంద్రం విడుదల చేసిందని వెల్లడించారు. ఈ నిధులకు సంబంధించి ఖర్చుల వినియోగ ధృవీకరణ పత్రాలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్స్) కేంద్రానికి సమర్పించిన తర్వాతే మిగిలిన రూ.2 వేల కోట్ల నిధులు కూడా వెంటనే విడుదల అవుతాయని స్పష్టం చేశారు.
పది పని దినాలలోపు పంచాయతీలకు నిధులు బదిలీ చేయాలి
రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేటాయించిన నిధుల విషయంలో 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రూపొందించిన కార్యాచరణ, మార్గదర్శకాల ప్రకారం కేంద్రం నుండి రాష్ట్రాలకు నిధులు అందిన వెంటనే ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖలు, పది పని దినాలలోపు ఎటువంటి కోతలు లేకుండా సంబంధిత గ్రామ పంచాయతీలన్నింటికీ ఆయా నిధులను వెంటనే బదిలీ చేయాలని తెలిపారు. తదనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఈ నిధులను పది పని దినాలలోపు ఆయా గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాల్సి ఉంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. పది పని దినాలకు మించి ఏదైనా ఆలస్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాల కోసం తీసుకున్న మార్కెట్ రుణాలు, రాష్ట్ర అభివృద్ధి రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ రేటు ప్రకారం గ్రామ పంచాయతీలకు కూడా వడ్డీతో కలిపి కేంద్ర నిధులను విడుదల చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మార్గదర్శకాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ నిధుల వినియోగం కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను నిర్వహించాలని,
దీనిని పిఎఫ్‌ఎంఎస్ పోర్టల్లో ఒక ప్రత్యేకమైన ఏజెన్సీ కోడ్‌తో నమోదు చేసి పారదర్శకతతో నిధుల బదిలీ, ఖర్చు, యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ చేసిన సిఫార్సులకు అనుగుణంగా గ్రామీణ స్థానిక సంస్థల అభివృద్ధికి 15 వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు విడుదల చేస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆ ప్రకటనలో వెల్లడించారు. గతంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర పనుల కోసం మళ్లించి గ్రామాలకు అన్యాయం చేసిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఫలితంగా అనేక మంది సర్పంచ్‌లు తమ పదవీకాలంలో అమలు చేసిన పనులకు నిధులు అందకపోవడంతో రాజీనామా చేశారని తెలిపారు.