
భారతీయ టెలివిజన్ రంగంలో యాడ్స్ ప్రసారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న నిబంధనలకు స్వస్తి పకుతూ.. టీవీ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే ప్రకటనలపై ఉన్న 12 నిమిషాల గరిష్ట పరిమితిని ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది.
1994 కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నిబంధనల ప్రకారం 2006లో ఈ 12 నిమిషాల క్యాప్ అమల్లోకి వచ్చింది. ఆ కాలంలో అనలాగ్ టెక్నాలజీ, పరిమిత ఛానెల్స్ ఉన్న నేపథ్యంలో వీక్షకుల ప్రయోజనాలను కాపాడటానికి ఈ నిబంధనను తీసుకువచ్చారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ వ్యవస్థ విస్తరించడంతో ఈ నిబంధన కాలం చెల్లిందని ప్రభుత్వం భావించింది.
ప్రస్తుతం దేశంలో వందలాది టీవీ ఛానెళ్లు అందుబాటులో ఉండటంతో పాటు డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో సాంప్రదాయ టీవీ ఛానెళ్లు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. డిజిటల్ మీడియాతో సమానంగా టీవీ బ్రాడ్‌కాస్టర్లకు కూడా వ్యాపార అవకాశాలు కల్పించేందుకు.. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే బ్రాడ్‌కాస్టర్లు తమ సొంతంగా ప్రకటనల సమయాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ లభిస్తుంది. ముఖ్యంగా లైవ్ స్పోర్ట్స్ ప్రసారాలు, రియాలిటీ షోల సమయంలో ప్రకటనల సమయాన్ని పెంచుకోవడానికి ఛానెళ్లకు అవకాశం దక్కుతుంది. అయితే గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే ఈ మార్పులు పూర్తిగా అమల్లోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
ప్రకటనల పరిమితిని ఎత్తివేయడం వల్ల ప్రేక్షకులు ఎక్కువ సమయం యాడ్స్ చూడాల్సి వస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే మార్కెట్ పోటీ కారణంగా ఛానెళ్లు తామే స్వయంగా నిబంధనలను పాటించి, వీక్షకుల ఆదరణ కోల్పోకుండా జాగ్రత్త పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు దేశంలోని శాటిలైట్ ఛానళ్లు తమ ప్రసారాల్లో యాడ్స్ కంటెంట్ మధ్య సమతుల్యతను పాటించటం వీక్షకులకు కూడా ఇబ్బంది కలిగించకపోవచ్చని అంటోంది కేంద్రం.