Reading Time: 2 minutes
Ayushman Bharat: రూ.5 లక్షల వరకు ఫ్రీ.. వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం కింద ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా దేశంలోని పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచితంగా క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ కల్పిస్తోంది. నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఈ సదుపాయం పొందవచ్చు. అయితే ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరి కార్డు పొందాల్సి ఉంటుంది. ఈ పథకంలో మీ అర్హతను తనిఖీ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. మీకు అర్హత ఉంటే కార్డు ఆన్‌లైన్‌లో వెంటనే మంజూరు అవుతుంది. ఈ కార్డు ద్వారా మీరు ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స పొందవచ్చు. అయితే వాట్సప్ ద్వారా కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని కార్డు పొందవచ్చు. అదెలా అనేది చూద్దాం.

వాట్సప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

ఆయుష్మాన్ భారత్ సారథి వాట్సప్ చాట్‌బాట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం +9172908 23838 నెంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. అనంతరం ఆ నెంబర్‌కు హాయ్ లేదా హాలో అని వాట్సప్‌లో మెస్సేజ్ పంపాలి. ఆ తర్వాత Choose Service ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం ఆయుష్మాన్ కార్డు ఎంపికను ఎంచుకుని అప్లై PMJAY Cardపై క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు అర్హత ఉంటే వెంటనే అక్కడ కనిపిస్తుంది. కేవైసీ పూర్తి చేస్తే మీ కార్డు జనరేట్ అవుతుంది. ఆ కార్డును ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఇక వాట్సప్ చాట్ బాట్ ద్వారా కేవైసీ అప్డేట్, ఆధార్ లింక్, కార్డు లాక్ లేదా అన్ లాక్ సేవలను పొందవచ్చు.

ఈ పథకానికి ఎవరు అర్హులంటే..?

రేషన్ కార్డు కలిగి ఉండాలి. బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి. ఇక కుటుంబ వార్షిక ఆదాయం నిబంధనలకు లోబడి ఉండాలి. 70 ఏళ్ల వయస్సు దాటినవారు ఆదాయంతో సంబంధం లేకుండా అర్హులు. ప్రస్తుతానికి వైద్య ఖర్చులు అనేవి భారీగా పెరిగాయి. దీంతో పేదలపై భారం పడుతుంది. వైద్యానికి లక్షలకు లక్షలు ఖర్చు అవుతుంది. దీంతో పేదలకు వైద్య భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఎప్పటినుంచో ఈ స్కీమ్ కొనసాగుతోంది. దీని వల్ల ఇప్పటికే లక్షలాది మంది లబ్దిదారులు సాయం పొందారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు ఈ కార్డు కలిగి ఉన్నారు. అత్యవసర వైద్య చికిత్స సమయంలో ఇది ఉపయోగపడుతుంది.