Reading Time: 3 minutes

స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు రాకేశ్ జున్‌జున్‌వాలా ఇచ్చిన 14 సూత్రాలు.. తెలుసుకుంటే సక్సెస్!

Caption of Image.

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో రాకేశ్ జున్‌జున్‌వాలా ఒక తిరుగులేని లెజెండ్. మార్కెట్‌ను ముందుగానే అంచనా వేయలేమని నమ్మిన ఆయన.. సరైన వ్యాపారాన్ని ఎంచుకోవడం, మార్కెట్‌ను గౌరవించడం, సంపద పెరిగే వరకు ఓపికగా ఉండటం అనే సూత్రాలతో కోట్లాది రూపాయల సంపదను సృష్టించారు. 1980లలో కేవలం 5 వేల రూపాయలతో మార్కెట్లోకి అడుగుపెట్టి.. ‘రేర్ ఎంటర్‌ప్రైజెస్’ ద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధిపై అపార నమ్మకంతో టైటాన్, టాటా మోటార్స్ వంటి అగ్రగామి కంపెనీలలో భారీ పెట్టుబడులు పెట్టారు. వేల రూపాయల నుంచి వేల కోట్ల వరకూ ఆయన ప్రయాణానికి దోహదపడిన కొన్ని సక్సెస్ సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..

1. పెట్టుబడులపై ఓపిక పట్టండి:
స్టాక్ మార్కెట్‌లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులు సహజం. మంచి కంపెనీ షేర్ ధర కూడా కొన్నిసార్లు తాత్కాలికంగా పడిపోవచ్చు. బిజినెస్ ఫౌండేషన్ బలంగా ఉన్నప్పుడు మార్కెట్ ఒడిదుడుకులకు భయపడి స్టాక్స్‌ను అమ్మేయకూడదు. టైం అండ్ కాంపౌండింగ్ శక్తికి తగిన సమయం ఇస్తేనే భారీ సంపద సృష్టి జరుగుతుంది.

2. మార్కెట్‌ను టైమ్ చేయాలని చూడొద్దు:
మార్కెట్ ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు లేస్తుందో ఖచ్చితంగా ఎవరూ అంచనా వేయలేరు. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు వంటి ఎన్నో అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి రేపటి ఇండెక్స్ కదలికలను అంచనా వేయడం కంటే.. పెట్టుబడి పెట్టిన కంపెనీ నాణ్యతపై దృష్టి పెట్టడం ముఖ్యం.

3. వాల్యుయేషన్లను గౌరవించండి:
కేవలం ఒక కంపెనీ పాపులర్ అయిందనో లేదా షేర్ ధర వేగంగా పెరుగుతోందనో FOMO తో గుడ్డిగా కొనకూడదు. ఇది మంచి వ్యాపారమేనా? నేను చెల్లిస్తున్న ధర సరైనదేనా? అని ఎప్పుడూ బేరీజు వేసుకోవాలి.

4. రిస్క్‌ను అర్థం చేసుకోండి:
స్టాక్ మార్కెట్ అనేది రిస్క్ లేనిది కాదు. మీ పోర్ట్‌ఫోలియో కొన్ని నెలలు.. సంవత్సరాల పాటు నష్టాల్లో ఉండవచ్చు. రిస్క్‌ను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు కానీ, మీరు భరించగల రిస్క్‌ను ముందే అంచనా వేసుకుని పెట్టుబడి పెట్టాలి. నష్టాన్ని తట్టుకోగల శక్తిని బట్టే స్టాక్ మార్కెట్లో మనం తీసుకునే రిస్క్ ఉండాలి. రిస్క్ ఎక్కువైతే రివార్డ్ ఎక్కువ ఉంటుందని గుడ్డి లెక్కలు వేసుకోకూడదు. 

5. తప్పుల నుండి నేర్చుకోండి:
ప్రతి ఇన్వెస్టర్ తప్పులు చేస్తుంటారు. కానీ ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడమే అసలైన సక్సెస్. రీసెర్చ్ లేకుండా కొనడం, టిప్స్ నమ్మి మోసపోవడం వంటి తప్పులను మళ్లీ మళ్లీ రిపీట్ చేయకుండా ఉండటమే అనుభవానికి నిదర్శనం.

►ALSO READ | మన పాత బంగారం అమ్ముకుంటే వచ్చిన లాభానికి పన్ను కట్టాలా? పూర్తి వివరాలు

6. భావోద్వేగాలను అణచివేయండి:
భయం, అత్యాశ మార్కెట్‌ను నడిపించే 2 ప్రధాన శక్తులు. మార్కెట్ పడిపోయినప్పుడు భయంతో అమ్మేయడం, విపరీతంగా పెరిగినప్పుడు అత్యాశతో కొనడం చేయకూడదు. పెట్టుబడికి ఒక క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ఉండాలని రాకేశ్ చెబుతుంటారు.

7. షేర్ ధర కాదు, వ్యాపారాన్ని కొనండి:
మీరు కొనేది కేవలం ఒక కాగితపు షేర్ కాదు.. ఒక వ్యాపారంలో వాటా అని గుర్తుంచుకోవాలి. ఆ కంపెనీ ఏం అమ్ముతుంటుంది. ఎలా లాభాలు ఆర్జిస్తుంది, దాని అప్పులు ఎంత అనే పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టాలి.

8. మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం:
ఎంత మంచి వ్యాపారమైనా దానిని నడిపించే మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది. ప్రమోటర్ల ట్రాక్ రికార్డ్, కార్పొరేట్ గవర్నెన్స్, మైనారిటీ షేర్ హోల్డర్ల పట్ల వారి విధానం ఎలా ఉందో గమనించాలి.

9. గుడ్డిగా ఉండకూడదు:
మీ పెట్టుబడిపై మీకు నమ్మకం ఉండాలి. మార్కెట్ తాత్కాలికంగా పడిపోయినా ఆ వ్యాపారంపై నమ్మకంతో వేచి ఉండవచ్చు. అయితే కంపెనీ మూలాలు పూర్తిగా మారిపోయినప్పుడు కేవలం నేను ముందే డబ్బు పెట్టాను కదా అనే మొండితనంతో ఉండకూడదు. అంటే చేసే పెట్టుబడిపై నమ్మకం ఉండాలి కానీ గుడ్డి నమ్మకం మాత్రం ఉండొద్దు. 

10. ఇతరులు అమ్ముతున్నప్పుడు కొనండి:
మార్కెట్ విపరీతమైన భయంతో అందరూ షేర్లు అమ్ముతున్నప్పుడు, కాంట్రారియన్ అంటే వ్యతిరేకంగా ఆలోచనతో మంచి కంపెనీల షేర్లను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాలను వెతకాలి. అయితే గుడ్డిగా పడిపోతున్న ప్రతి స్టాక్‌ను కొనకూడదు. ఇందుకోసం మంచి హోంవర్క్ అండ్ రీసెర్చ్ ముఖ్యం.

11. షేర్ల ధరే దేవుడు:
ధరే దేవుడు – అంటే మీరు కొనే షేరు ధర అత్యంత కీలకం. ఎంత గొప్ప కంపెనీ అయినప్పటికీ.. దాన్ని విపరీతమైన ఎక్కువ ధరకు కొంటే అది మంచి పెట్టుబడి అనిపించుకోదు. సరైన షేర్ వాల్యూ దగ్గర మంచి కంపెనీల్లో వాటాలను దక్కించుకోవాలి.

12. అప్పు చేసి పెట్టుబడి వద్దు:
ఎప్పుడూ ఇతరుల దగ్గర అప్పు చేసి లేదా లోన్లు తీసుకొని స్టాక్ మార్కెట్లో పెట్టకూడదు. మార్కెట్ పడిపోయినప్పుడు ఆ అప్పుల ఒత్తిడి మిమ్మల్ని తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీ వద్ద ఉన్న మిగులు నిధులతోనే ఇన్వెస్ట్ చేయాలి.

13. మార్కెట్ గురించి నిరంతరం నేర్చుకోండి:
మార్కెట్‌ను కేవలం పుస్తకాల ద్వారా పూర్తిగా నేర్చుకోలేం. పరిశీలన, అనుభవం, రీసెర్చ్ ద్వారానే జ్ఞానం వస్తుంది. ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు చదవడం, బ్యాలెన్స్ షీట్లను అర్థం చేసుకోవడం నేర్చుకుంటే ఎవరి టిప్స్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

14. త్వరగా కోటీశ్వరులు కావాలనుకోకండి:
స్టాక్ మార్కెట్ అనేది రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే లాటరీ టికెట్ కాదు. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడులు, సమయం మాత్రమే మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థితికి చేర్చుతాయని రాకేశ్ జున్‌జున్‌వాలా నమ్మేవారు. 

©️ VIL Media Pvt Ltd.