
Deputy CM Pawan Kalyan: కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలు, యువత పాటించాల్సిన బాధ్యతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు రంగాల్లో ముందుకు సాగుతోందని తెలిపారు. అడవితల్లి బాట కార్యక్రమం కింద గిరిజన ప్రాంతాలకు రహదారుల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి
పులివెందుల, డోన్ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతులకు సాగునీటి సౌకర్యం అందించడంతో పాటు రాష్ట్రంలో నీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇక, రాష్ట్రంలోని అటవీ సంపదను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్నామని, అలాగే అటవీ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను నిరోధించి, ఆక్రమిత భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
అమరావతి, పోలవరంపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకమని ఆయన అన్నారు.
రూ.1,000 కోట్లతో పిఠాపురం అభివృద్ధి
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రూ.1,000 కోట్లతో పిఠాపురం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మౌలిక వసతులు, ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. స్వేచ్ఛను ఇతరులను దూషించడానికి ఉపయోగించవద్దని అన్నారు. సోషల్ మీడియాలో ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని సూచించారు. ఏ విషయాన్నైనా వెంటనే నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని చెప్పారు. వ్యవస్థలో ఏదైనా తప్పు కనిపిస్తే దానిని సరిదిద్దేందుకు ప్రయత్నించాలి కానీ వ్యవస్థనే ధ్వంసం చేయకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ప్రజా ఆస్తులను ఎప్పుడూ ధ్వంసం చేయలేదని గుర్తుచేశారు. ఏదైనా విషయాన్ని నమ్మే ముందు ఆలోచించాలని, నిర్ణయం తీసుకునే ముందు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. స్వాతంత్ర్యం మనకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చిందని, ఆ స్వేచ్ఛను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు.