Reading Time: < 1 minute

ఇండియా హిస్టరీలో ఫస్ట్ టైమ్: తొలిసారి దేశవ్యాప్తంగా కులగణన.. 10వ ప్రశ్నగా కులం వివరాలు నమోదు

Caption of Image.

న్యూఢిల్లీ: త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణన-2027పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టేందుకు మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా.. పౌరులను అడిగే 40 ప్రశ్నలతో కూడిన సమగ్ర జాబితాను నోటిఫై చేసింది.

జనగణన ప్రశ్నావళిలో ఈసారి కీలక మార్పులు చేసింది. అందులోని 10వ ప్రశ్నగా ఎస్సీ, ఎస్టీలతో పాటు పౌరుల కులానికి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఈ జనాభా లెక్కల సేకరణను యాప్‌‌‌‌లు, డిజిటల్ టూల్స్​ద్వారా నిర్వహించనున్నారు. 

అంతేకాకుండా, పౌరులే స్వయంగా తమ వివరాలను నమోదు (సెల్ఫ్​ఎన్యుమరేషన్) చేసుకునేందుకు 15 రోజుల పాటు అవకాశం ఇస్తారు. మొత్తం రూ.11,718.24 కోట్ల అంచనా వ్యయంతో ‘జనగణన-2027’ను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. తొలి దశలో (2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) ఇండ్ల లెక్కింపు (హౌస్ లిస్టింగ్), నివాస వసతులకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు.

రెండో దశ (2027 ఫిబ్రవరి)లో జనాభా సంఖ్య, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణ ప్రక్రియను పూర్తిగా ముగిస్తారు. జనగణనలో ప్రజలు ఇచ్చే వ్యక్తిగత వివరాలకు పూర్తి చట్టపరమైన రక్షణ ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. సెన్సస్ యాక్ట్, 1948లోని సెక్షన్ 15 ప్రకారం పౌరుల సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతామని తెలిపింది.

©️ VIL Media Pvt Ltd.