
సాధారణంగా ఆలయాల్లో పూజలు, భజనలు, హారతులు కనిపిస్తాయి. వేదమంత్రాలు, భక్తి గీతాలతో మార్మోగుతుంటాయి. కానీ, ఈ ఆలయంలో మధ్యాహ్నం 12.30 అయిందంటే మాత్రం అక్కడి వాతావరణమే మారిపోతుంది..! గుడి ప్రాంగణంలో ఒక్కసారిగా వినిపించేది మంత్రాలు కాదు. దేవుడి ముందు భక్తితో చేతులు జోడించే భక్తులు.. అదే సమయంలో దేశం కోసం గౌరవంగా నిలబడతారు. ఆధ్యాత్మికతకు దేశభక్తిని జోడిస్తూ.. ఓ వినూత్న సంప్రదాయానికి తెరతీసింది. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్గొండ జిల్లా చింతపల్లిలో హైదరాబాద్ – నాగార్జునసాగర్ హైవేపై 2007లో సాయిబాబా ఆలయాన్ని కొందరు భక్తులు నిర్మించారు. సాయిబాబా ఆలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సాయిబాబా దర్శనం.. పూజలు.. భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. ఉదయం మొదలయ్యే సాయి స్మరణతో.. భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. కానీ.. మధ్యాహ్నం 12.30 అయిందంటే మాత్రం అక్కడి వాతావరణమే మారిపోతుంది. ఆ సమయంలో ఆలయంలో మరో ప్రత్యేక కార్యక్రమం మొదలవుతుంది. గుడి ప్రాంగణంలో ఒక్కసారిగా వినిపించేది మంత్రాలు కాదు.. జాతీయ గీతమైన జనగణమన. భక్తులంతా ఒకచోట చేరి.. గౌరవంగా నిలబడి.. జాతీయగీతాన్ని ఆలపిస్తారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణం మొత్తం జనగణమనతో మార్మోగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు దేశభక్తిని పెంపొందించేలా జాతీయ గీతాన్ని కూడా నిత్య కార్యక్రమంలో భాగం చేశారు. ఆధ్యాత్మికతకు దేశభక్తిని జోడిస్తూ.. వినూత్న సంప్రదాయాన్నీ కొనసాగిస్తున్నారు ఇక్కడ భక్తులు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాయి స్మరణతో ప్రారంభమయ్యే రోజు.. జనగణమనతో దేశభక్తిని చాటే జాతీయగీతాన్ని ప్రతిరోజూ మధ్యాహ్నం ఆలాపిస్తున్నారు.
జాతీయ పతాక రంగులతో అలంకరణ..
ఈ ఆలయంలో జాతీయ పర్వదినానాల్లో సాయిబాబా విగ్రహాన్ని జాతీయపతాక రంగుల అలంకరణతో ముస్తాబు చేస్తుండడం విశేషం. ఇది కేవలం ఓ కార్యక్రమంగా కాకుండా.. ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే సంప్రదాయంగా మారిపోయింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తులు ఇందులో పాల్గొంటుండటంతో.. దేశం పట్ల గౌరవం, జాతీయ భావనను చిన్న వయసు నుంచే పెంపొందించాలన్న సందేశం అందుతోంది.
నిత్యం మధ్యాహ్నం జాతీయ గీతాలాపన..
భక్తితో పాటు దేశభక్తి కూడా అవసరమని, దేశం పట్ల గౌరవం, జాతీయ భావనను చిన్న వయసు నుంచే పెంపొందించాలన్న ఉద్దేశంతో సాయిబాబా ఆలయంలో మధ్యాహ్నం జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఆలయ ట్రస్ట్ చైర్మెన్ మంచి కంటి ధనుంజయ్య తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంతో పాటు.. సమాజంలో దేశభక్తి భావనను బలపర్చాలన్న ఉద్దేశంతో ప్రతిరోజూ మధ్యాహ్నం జాతీయగీతాన్ని ఆలపించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామనీ చెప్పారు.
ఈ ఆలయంలో ప్రతినిత్యం దేవుడికి మొక్కుతూ.. దేశానికి వందనం చేస్తుంటారు. దేవుడి ముందు భక్తి ఎంత ముఖ్యమో.. దేశం ముందు బాధ్యత కూడా అంతే ముఖ్యమనే సందేశం, సంప్రదాయం.. ఈ ఆలయం అందిస్తోంది. భక్తి, దేశభక్తి రెండూ కలిసే అరుదైన దృశ్యానికి ఈ ఆలయం వేదికగా నిలుస్తోంది.