Reading Time: 2 minutes
Venky Atluris Vishwanath And Sons Sparks Trivikram Comparisons

Venky Atluri: టాలీవుడ్‌లో రచయితగా తన ప్రయానాన్ని మొదలుపెట్టి ప్రత్యేక గుర్తింపు సంపాదించిన దర్శకుల జాబితాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ముందుంటుంది. ఆయన మాటలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ను చూపించే శైలి ప్రేక్షకుల్లో ప్రత్యేక ముద్ర వేసింది. ఇప్పుడు అదే తరహాలో మరో దర్శకుడి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ‘సర్’, ‘లక్కీ భాస్కర్’ తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరోసారి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరి రచనను చాలామంది త్రివిక్రమ్ శైలితో పోలుస్తూ చర్చిస్తున్నారు. సూర్య, మమితా బైజు, రాధిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తర్వాత సినిమా కథతో పాటు అందులోని డైలాగ్స్, ఎమోషన్ సన్నివేశాలకు మంచి స్పందన వస్తోంది. ఇందులో వెంకీ అట్లూరి రాసిన కొన్ని డైలాగులు, ఫ్యామిలీ ఎమోషన్స్ ను చూపించిన తీరు త్రివిక్రమ్ శైలిని గుర్తు చేస్తోందంటూ సోషల్ మీడియాలో కూడా అనేక పోస్టులు కనిపిస్తున్నాయి. ఆయన పనితనాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు కూడా.

వెంకీ అట్లూరి ప్రయాణాన్ని పరిశీలిస్తే, ఆయన కెరీర్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. నటుడిగా ప్రారంభమైన ప్రయాణం తర్వాత దర్శకుడిగా మారిన ఆయన, క్రమంగా తన కథలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ‘సర్’తో విద్యా వ్యవస్థపై  ‘లక్కీ భాస్కర్’తో మధ్యతరగతి మనిషి జీవితాన్ని తెరపై చూపించారు. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో కుటుంబ బంధాలను తీసుకుని మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు.  త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ‘పదాల మాంత్రికుడు’ అనే గుర్తింపు తీసుకొచ్చింది ఆయన చమత్కారమైన డైలాగులే. ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమాల్లో కూడా అలాంటి చమత్కారం ఎక్కువే కనబడుతోంది. ఇద్దరి మధ్య పోలికలు సోషల్ మీడియాలో సహజంగానే చర్చకు వస్తున్నాయి. ఇక వెంకీ తనదైన శైలిలో ముందుకు సాగుతూ, కొత్త తరానికి నచ్చే కుటుంబ కథలను నిర్మించాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన సినిమాల సెలెక్షన్స్ చూస్తే స్పష్టమవుతోంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు లభిస్తున్న స్పందన, వెంకీ అట్లూరి వరుస విజయాలు చూస్తే, కుటుంబ భావోద్వేగ కథలకు కొత్త తరహా టచ్ ఇవ్వగల దర్శకుడిగా ఆయన స్థానం మరింత బలపడుతోందనే అభిప్రాయం ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇప్పుడు దర్శకుడు వెంకీ అట్లూరి సూర్య హీరోగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయంతో మంచి ఫామ్‌లో ఉండగా, ఆయన తన తదుపరి చిత్రాలను మరింత క్రేజీ కాంబినేషన్లతో ప్లాన్ చేస్తున్నారు. గతంలో సాధించిన ‘సర్’ (SIR) ఘనవిజయం తర్వాత తమిళ స్టార్ హీరో ధనుష్‌తో ఒక పవర్‌ఫుల్ పోలీస్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయడానికి ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు సిద్ధూ జొన్నలగడ్డతో ఒక సరికొత్త వెబ్ సిరీస్ ప్రాజెక్ట్‌ను, అలాగే న్యాచురల్ స్టార్ నానితో ఒక కమర్షియల్ చిత్రాన్ని లైనప్‌లో పెట్టారు. ఇక దుల్కర్ సల్మాన్‌తో తాను తీసిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి కూడా సీక్వెల్ (Lucky Baskhar 2) చేసే ఆలోచన ఉందని, అయితే అది మరో రెండేళ్ల తర్వాతే పట్టాలెక్కే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.